70మందికి పైగా గల్లంతు
విధాత, హైదరాబాద్ : పశ్చిమ ఆఫ్రికా దేశమైన మౌరిటానియా తీరంలో పడవ బోల్తా పడటంతో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. వలసదారులు యూరఫ్ వెళ్లేందుకు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. నైరుతి మౌరిటానియాలోని ఎన్టియాగోకు నాలుగు కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్ తీరంలో పడవ బోల్తా పడింది. 89 మంది అక్రమ వలసదారుల మృతదేహాలను మౌరిటానియన్ తీర రక్షకులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా నివేదించింది. 6 రోజుల క్రితం సెనెగల్-గాంబియా సరిహద్దు నుంచి యూరప్ వైపు బయలుదేరిన పడవలో 170 మంది వలసదారులు ఉన్నారు. ఐదేళ్ల బాలికతో సహా తొమ్మిది మందిని కోస్ట్ గార్డులు రక్షించారు. 70 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. వీరి కోసం పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అట్లాంటిక్ సముద్రాన్ని దాటి ఐరోపాకు వెళ్లేందుకు ప్రతిరోజూ వందలాది మంది ఈ ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నారు. మధ్యధరా ప్రాంతంలో భారీ భద్రతను ప్రవేశపెట్టిన తరువాత అట్లాంటిక్ మార్గం గుండా వలసలు విస్తృతంగా పెరిగాయి. ఈ ప్రమాదకరమైన సముద్ర ప్రయాణానికి పనికిరాని చెక్క పడవలు వినియోగిస్తున్నారు. పడవల నిండా మనుషులును ఎక్కించుకుని, సరిపడా నీరు, ఆహారం లేకుండా ప్రమాదానికి గురవుతున్నారు. స్పానిష్ స్వచ్ఛంద సంస్థ కామినారో ఫ్రాంటెరాస్ ప్రకారం, ఈ సంవత్సరం సముద్రం దాటి స్పెయిన్‌కు వెళ్లే ప్రయత్నంలో 5,000 మందికి పైగా వలసదారులు మరణించారు. ఇక్కడ ప్రతిరోజూ 33 మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది.