Dense Fog | దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పొగ మంచు భారీగా కురుస్తున్న విషయం తెలిసిందే. పొగ మంచు కారణంగా ఉదయం వేళ బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పొద్దున్నే స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఎముకలు కొరికే చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల టైమింగ్స్ ఛేంజ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా పరిధిలోని పాఠశాలలన్నీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు జనవరి 19 నుంచి తదుపరి ఆర్డర్స్ వచ్చే అమల్లో ఉంటాయన్నారు. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లకు వర్తిస్తాయన్నారు.
ఆదివారం ఉదయం పలు చోట్ల దట్టమైన పొగమంచు కురిసిందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని తెలిపింది. సాధారణం కంటే 1.6 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు గజగజ వణికిపోయారు.
