బాయ్‌ఫ్రెండ్ కుమార్తె (18నెలలు)కు బ్యాటరీలు, చిన్న చిన్న మేకులు, నెయిల్ పాలిష్ రిమూవర్‌లను తినిపించి హత్య చేసిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా (America) లోని పెనసల్వేనియా రాష్ట్రంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది. అలేసియా ఓవెన్స్ (20) అనే యువతి బెయిలీ జాకోబ్ అనే వ్యక్తితో సంబంధంలో ఉండేది. అతడికి అప్పటికే తన భార్యతో విడాకులు అయిపోయాయి. కుమార్తెను చూడటానికి కోర్టు అనుమతి ఉండటంతో భార్య నుంచి కుమార్తె ఐరిస్ రితా అల్ఫెరాను తెచ్చుకుని ఒక్కో రోజు తన దగ్గర ఉంచుకునేవాడు.
ఈ క్రమంలో 2023 జూన్ 23న జాకోబ్ ఇంట్లోనే కుమార్తె, ప్రియురాలు అలేసియా కూడా ఉన్నారు. ఒక సమయంలో జాకోబ్ దగ్గర్లోని స్టోర్‌కు వెళ్లగా.. కాసేపటికే అలేసియా అతడికి ఫోన్ చేసి.. పాపకు సీరియస్‌గా ఉందని వెంటనే ఇంటికి రావాలని ఫోన్ చేసింది. అతడు హుటాహుటిన వెళ్లేటప్పటికే కొన ఊపిరితో ఉండటంతో అంబులెన్స్‌ను పిలవడం ఆసుపత్రిలో చేర్చడం జరిగిపోయాయి. అయితే నాలుగు రోజుల పాటు చికిత్స తీసుకున్న అనంతరం ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. విచారణలో చిన్నారి మంచం పైనుంచి కింద పడటంతో తలకు దెబ్బ తగిలి చనిపోయిందని అలేసియా చెప్పడంతో పోలీసులు దీనిని ప్రమాదంగా భావించారు. అయితే ఐరిస్ తల్లి దీనిపై పోలీసులను ఆశ్రయించి లోతుగా దర్యాప్తు చేయాలని కోరడంతో పోస్ట్ మార్టం నిర్వహించారు.
ఆ నివేదిక ప్రకారం అంతర్గత అవయవాలు విఫలం కావడం వల్లే చిన్నారి చనిపోయిందని, కింద పడటం వల్ల కాదని తేలింది. దీంతో పాటు రక్తంలో అసిటోన్ అనే విషపదార్థం ఉందని, శరీరంలో బటన్‌లు, స్క్రూలు మొదలైన వస్తువులూ ఉన్నాయని తెలిసింది. పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేయగా.. దీని వెనుక ఉన్నది అలేసియా అని గుర్తించారు. హత్య జరిగిన ఘటనకు కొన్ని రోజుల ముందు నుంచి ఆమె
ఆన్‌లైన్‌లో ఏమేం వెతికిందో పోలీసులు సమాచారం సేకరించారు. పిల్లలను హతమార్చే విషాల దగ్గరి నుంచి, వారికి హాని చేసే సౌందర్య సాధనాలు, గాఢమైన నెయిల్ పాలిష్, ఔషధాలు మొదలైన వాటిని సెర్చ్ చేసినట్లు తేల్చారు. పెనసల్వేనియా అటార్నీ జనరల్ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ‘ఈ కేసు నిజంగా చాలా భయంకరమైనది. అసలు ప్రతిఘటించే శక్తి లేని శిశువును క్రూరంగా హత్య చేయడం దారుణం. పైగా పోలీసులను, న్యాయవ్యవస్థను
తప్పుదారి పట్టించేందుకూ నిందితురాలు ప్రయత్నించారు. ఇది అప్పటికప్పుడు క్షణికావేశంలో జరిగిన ఘటనా కాదు. హత్యకు నెలల ముందు నుంచి ఆమె ఎలా హత్య చేయాలో నెట్ లో సెర్చ్ చేసింది’ అని అటార్నీ జనరల్ వెల్లడించారు. ఈ ఘటనకు వెనుక ఉన్న కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.