Site icon vidhaatha

Bus falls | పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలోపడి 28 మంది దుర్మరణం

Bus falls : పాకిస్థాన్‌ (Pakistan) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోతైన లోయలో పడటంతో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. టర్బాట్‌ నుంచి క్వెట్టాకు వెళ్తున్న బస్సు బలూచిస్థాన్ రాజధాని క్వెట్టా సమీపంలో ప్రమాదానికి గురైంది.

బస్సు టర్బాట్‌ నుంచి క్వెట్టాకు 50 మందికిపైగా ప్రయాణికులతో బయలుదేరింది. కనుమ మార్గంలో ప్రయాణిస్తుండగా అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 28 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 22 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది.

డ్రైవర్‌ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే వాహనం అదుపుతప్పి లోయలో పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇటీవల బాల్టిస్థాన్‌లోనూ ఈ తరహా ఘటనే చోటు చేసుకొంది. ప్రమాదవశాత్తు బస్సు లోయలోపడి 20 మంది మరణించారు.

Exit mobile version