Site icon vidhaatha

 బ్రిటన్‌ సంపన్న భారతీయ కుటుంబం హిందూజాలలో నలుగురికి నాలుగున్నరేళ్ల జైలు

లండన్‌: బ్రిటన్‌లో భారతీయ సంతతికి చెందిన ప్రముఖ సంపన్న కుటుంబం హిందూజాలు మరోసారి వివాదాలతో పత్రికలకెక్కారు. జెనీవాలోని వారి విల్లాలో పనిచేసేందుకు రప్పించిన భారతీయ సిబ్బందిని నానా హింసలు పెట్టినందుకు స్విట్జర్లాండ్‌లోని ఒక కోర్టు హిందూజా కుటుంబంలోని నలుగురు కీలక వ్యక్తులకు జైలు శిక్ష విధించింది. అక్రమంగా ఉద్యోగంలో పెట్టుకున్నారని, వారిని దోపిడీ చేశారని రుజువైన నేపథ్యంలో ప్రకాశ్‌, కమల్‌, వారి కుమారుడు అజయ్‌, ఆయన భార్య నమ్రతలకు కోర్టు నాలుగున్నరేండ్ల జైలు శిక్ష విధించింది. అయితే.. మానవ రవాణా అభియోగాల నుంచి మాత్రం కోర్టు వారిని వదిలేసింది. హిందూజా కుటుంబం వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అనేక సందర్భాల్లో ఆ కుటుంబం పేరు వివాదాల్లో వచ్చింది.
ఇదీ కుటుంబ చరిత్ర
వీరి కుటుంబంలో పూర్వీకుడు ప్రేమానంద్‌ దీప్‌చంద్‌ హిందూజా బ్రిటిష్‌ ఇండియాలో సింధ్‌ ప్రాంతంలోని షికార్‌పూర్‌లో వ్యాపారం చేసుకునేవారు. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆయన తన బ్యాంకింగ్‌, వ్యాపార సంస్థలను బాంబేకు మార్చాడు. 1919లో ఇరాన్‌లో తన కంపెనీ మొదటి అంతర్జాతీయ విభాగాన్ని స్థాపించాడు. 1935లో ఆయన పెద్ద కొడుకు శ్రీచంద్‌ పీ హిందూజా తండ్రి నుంచి పగ్గాలు స్వీకరించారు. ఇరాన్‌లో ఇస్లామిక్‌ విప్లవం మొదలైన తర్వాత తమ కార్యకలాపాలను 1979లో లండన్‌కు మార్చారు. చైర్మన్‌ శ్రీచంద్‌తోపాటు.. ఆయన సోదరుడు, కో చైర్మన్‌ గోపీచంద్‌ అదే ఏడాది లండన్‌కు మకాం మార్చేశారు. మూడో సోదరుడు ప్రకాశ్‌ జెనీవా నుంచి స్విట్జర్లాండ్‌లో వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటుంటే.. చివరి వాడైన అశోక్‌.. భారతదేశంలో వ్యవహారాలను చక్కబెడుతున్నారు. 2023లో శ్రీచంద్‌ మరణం తర్వాత గోపీచంద్‌.. హిందూజా గ్రూప్‌ చైర్మన్‌ బాధ్యతల్లోకి వచ్చారు.
ఈ రోజు హిందూజా గ్రూపులో రెండు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆలోమోటివ్‌, బ్యాంకింగ్‌, చమురు, రసాయనాలు, ఐటీ, సైబర్‌ సెక్యూరిటీ, హెల్త్‌కేర్‌, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మీడియా, వినోదం, రియల్‌ ఎస్టేట్‌, పవర్‌ తదితర రంగాల్లో హిందూజా గ్రూపు సంస్థలు ఉన్నాయి. అశోక్‌ లేలాండ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ వీరివే. అలాగే పలు కీలక వివాదాల్లో ఆ కుటుంబం వస్తూ ఉన్నది.

బోఫోర్స్‌ కుంభకోణంతో లింకు
ఒకప్పుడే దేశాన్ని కుదిపివేసిన బోఫోర్స్‌ శతఘ్నుల కొనుగోలు కుంభకోణంలో శ్రీచంద్‌, గోపీచంద్‌, ప్రకాశ్‌ పేర్లు వచ్చాయి. ఇండియాకు హోవిట్జర్‌ గన్‌లను సరఫరా చేసే డీల్‌లో బోఫోర్స్‌ నుంచి ఈ ముగ్గురు కమిషన్లు పొందారని 2000 సంవత్సరంలో సీబీఐ చార్జిషీటు వేసింది. అయితే.. తగిన ఆధారాలు లేవంటూ 2005లో ఢిల్లీ హైకోర్టు ఆ కేసును కొట్టివేసింది.
యూకే పౌరసత్వం వివాదం
శ్రీచంద్‌కు బ్రిటిష్‌ పౌరసత్వం ఇవ్వడంలో సహాయపడ్డారన్న ఆరోపణలపై యూకే మంత్రి పీటర్‌ మండేల్సన్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పట్లో ఈ వ్యవహారం ‘హిందూజా ఎఫైర్‌’ పేరిట పత్రికల్లో నానింది. లండన్‌లోని మిలేనియం డూమ్‌కు 1998లో ఒక మిలియన్‌ పౌండ్లు శ్రీచంద్‌ నుంచి విరాళంగా తీసుకుని ఆయనకు బ్రిటిష్‌ పాస్‌పోర్టు ఇప్పించారనేది ఆయనపై అభియోగం. ఆ తర్వాతే శ్రీచంద్‌, గోపీచంద్‌, ప్రకాశ్‌, అశోక్‌ బ్రిటన్‌ పౌరసత్వం పొందారు.

 

Exit mobile version