Fram2 mission | ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫ్రామ్2 మిషన్ చారిత్రక మైలురాయిని దాటింది. గగన తలం నుంచి భూమి యొక్క ధ్రువ ప్రాంతాన్ని మొట్టమొదటి సారిగా వీడియోలో చిత్రీకరించింది. “ఫ్రామ్2″ప్రైవేట్ వ్యోమగామి మిషన్‌ను 2025, మార్చి 31న నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుండి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రారంభించారు. ఇది “భూమి ధ్రువాల మీదుగా భూమి చుట్టూ తిరిగే మొట్టమొదటి వ్యోమ నౌక” అని చెబుతున్నారు. డ్రాగన్ రెసెలియన్స్ స్పేస్‌క్రాఫ్ట్ నుంచి తీసిన ఈ వీడియో.. ధృవాల్లోని మంచు పర్వతాల అద్భుతమైన దృశ్యాలను బంధించింది. మానవ సహిత స్పేస్‌ఫ్లైట్ ద్వారా మునుపెన్నడూ చూడని కోణంలో ధ్రువాల దృశ్యాన్ని ఆవిష్కరించింది. 90 డిగ్రీల కోణంలో కనిపిస్తున్న దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి. ఈ స్పేస్ క్రాఫ్ట్ ఉత్తర, దక్షిణ ధృవాలను దాటుకుంటూ పరిభ్రమించడం ఇదే మొదటిసారి.
The first astronauts to orbit the poles
https://t.co/9vvmmMAgsV— Elon Musk (@elonmusk) April 2, 2025
19వ శతాబ్దంలో ధృవాల అన్వేషణకు బయల్దేరిన నార్వేషిప్ ఫ్రామ్ పేరిట ఈ మిషన్‌ను చేపట్టారు. ఈ మిషన్‌లో మాల్టీస్ పారిశ్రామికవేత్త ఛున్ వాంగ్‌తోపాటు నార్వేజియన్ వెహికల్ కమాండర్ జన్నిక్కే మిక్కెల్సెన్, జర్మన్ పైలట్ రాబియా రోజీ, ఆస్ట్రేలియన్ మెడికల్ ఆఫీసర్ ఎరిక్ ఫిలిప్సాల్ ఉన్నారు.
గతంలో కొన్ని మిషన్‌లు భూమధ్య రేఖ చుట్టూనే తిరిగేవి. కానీ.. ఫ్రామ్2 పోలార్ ట్రాజెక్టరీకి మాత్రం ఫ్లారిడా, క్యూబా మీదుగా స్పెషలైజ్డ్ సదరన్ లాంచ్ రూట్ అవసరమైంది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ భూమికి 425 నుంచి 450 కిలోమీటర్ల ఎత్తున ప్రయాణిస్తున్నది. దీని వల్లనే ధృవాలు, వాటిలో ఐస్ షీట్స్, అద్భుతమై దృశ్యాల వీక్షణ సాధ్యమైంది. దీనికి సంబంధించిన వీడియోను స్పేస్‌ఎక్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. మూడు నుంచి ఐదు రోజులపాటు సాగే ఈ మిషన్‌లో భూమికి సంబంధించిన చిత్రాలను అందించడమే కాకుండా.. 22 అంశాలపై శాస్త్రీయ పరిశోధనలను నిర్వహించనున్నది. ఇందులో అంతరిక్షం నుంచి తొలి ఎక్స్‌రే చిత్రాన్ని తీయడం, మైక్రోగ్రావిటీలో మానవుల ఆరోగ్యాన్ని అధ్యయనం చేయడం వంటివి కూడా ఉన్నాయి. దీర్ఘకాలం అంతరిక్షంలో ప్రయాణించేందుకు సుస్థిరమైన పరిష్కారాలను కూడా ఇది అన్వేషించనున్నది.