Joe Biden : అమెరికా అధ్యక్ష రేసులోకి అనేక భారత సంతతి మహిళ కమలా హారిస్ (Kamala Harris) వచ్చారు. అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ (joe Biden) వైదొలుగుతూ ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారిస్‌కు తన మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ఒక పోస్టు పెట్టారు. అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకోవాలని తాను నిర్ణయించుకున్నానని, నా మిగిలిన అధ్యక్ష పదవీకాలంలో పూర్తిగా విధులపై దృష్టి సారించాలనుకుంటున్నానని బైడెన్ పేర్కొన్నారు.
తాను 2020లో పార్టీ తరఫున ఉపాధ్యక్షురాలు అభ్యర్థిగా కమలా హారిస్‌ను ఎంపికచేస్తూ తొలి నిర్ణయం తీసుకున్నానని, అది నా ఉత్తమ నిర్ణయమని భావిస్తున్నానని, ఇప్పుడు పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా కూడా కమలా హారిస్‌కు మద్దతు ప్రకటిస్తున్నానని తెలిపారు. డెమోక్రటిక్ నేతలందరం కలిసి ట్రంప్‌ను ఓడించాల్సిన సమయం వచ్చిందని, ఆయనను ఓడిద్దామని బైడెన్ పిలుపునిచ్చారు.
బైడెన్ మద్దతు నేపథ్యంలో ఒకవేళ 59 ఏళ్ల కమలా హారిస్‌ను డెమోక్రాట్లు తమ అభ్యర్థిగా ఆమోదిస్తే.. అమెరికా చరిత్రలోనే ఇది కీలక నిర్ణయం కానుంది. ఓ ప్రధాన పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి రేసులో నిలువనున్న తొలి ఆసియా సంతతి మహిళగా ఆమె చరిత్రకెక్కనుంది. అయితే కమలాహారిస్‌ను పార్టీ తమ అభ్యర్థిగా అంగీకరిస్తుందా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టమైన సమాచారం లేదు.
ప్రస్తుతం పార్టీ నామినేషన్ కోసం ఆమె సీనియర్ డెమోక్రాట్ల నుంచి సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అధ్యక్ష రేసు నుంచి బైడెన్ వైదొలగడం, కమలా హ్యారిస్‌ను అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదించడం లాంటి నిర్ణయాల పట్ల రిపబ్లికన్ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. కమలా హారిస్‌ను ఎదుర్కోవడం తనకు చాలా సులభమని పేర్కొన్నారు.