Joe Biden : అమెరికా అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) వైదొలగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బైడెన్ రేసు నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్లు పెరుగుతున్నాయి. బైడెన్ మానసిక పరిస్థితి నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) సైతం ఆయన అభ్యర్థిత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే అధ్యక్ష రేసులో కొనసాగడంపై బైడెన్ ఆత్మ శోధన చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ వారాంతంలోపే దీనిపై ఆయన కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వచ్చే నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో తాను గెలిచే అవకాశాలు లేవనే వాస్తవాన్ని బైడెన్ అంగీకరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధ్యక్షుడి సన్నిహితులు వెల్లడించినట్లు తెలిసింది.
సొంత పార్టీ నేతల నుంచి డిమాండ్లు వస్తున్న వేళ బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వైదొలిగే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెప్పినట్లు అమెరికా మీడియా సంస్థ ఒకట తన కథనంలో పేర్కొంది. పోటీ నుంచి తప్పుకునే అంశంపై బైడెన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారని, ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారని డెమోక్రాటిక్ పార్టీ వర్గాలను ఉటంకిస్తూ మరో పత్రిక వెల్లడించింది.
ఇటీవల కొవిడ్ బారిన పడిన బైడెన్ ప్రస్తుతం డెలావర్‌లోని తన ఇంట్లో క్వారెంటైన్‌లో ఉన్నారు. తాను తీవ్ర అనారోగ్యానికి గురైతే అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంపై ఆలోచిస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ క్రమంలోనే కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఈ వారాంతంలో అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఆమె పోటీ కోసం సన్నద్ధమవుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన రన్నింగ్ మేట్ ఎవరనే దానిపై ఆమె విస్తృత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో 81 ఏళ్ల బైడెన్‌కు విజయావకాశాలు తగ్గిపోయాయని, పోటీపై ఆయన పునరాలోచించుకోవాలని మాజీ అధ్యక్షుడు ఒబామా తన మిత్రుల వద్ద ప్రైవేటుగా వ్యాఖ్యానించారట. పార్టీ సీనియర్ నాయకురాలు నాన్సీ పెలోసీ నేరుగా బైడెన్‌కే ఫోన్ చేసి.. రేసు నుంచి వైదొలగాలని కోరారట. అధ్యక్షుడి వయసు, ఆయన ఆరోగ్య సమస్యలు, ఇతరత్రా కారణాలతో సొంత పార్టీలోనే ఆయనపై వ్యతిరేకత ఏర్పడింది.