అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మిషెల్లీ ఒబామా? బైడెన్‌ స్వచ్ఛందంగా తప్పుకొంటే డెమోక్రాట్ల చాయిస్‌ ఆమే!

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ఇప్పటి నుంచే హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. డెమోక్రటిక్‌ పార్టీ నుంచి ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్‌ బరిలో ఉంటే.. రిపబ్లికన్ల నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పోటీ చేస్తున్నారు.

  • Publish Date - June 30, 2024 / 07:55 PM IST

వాషింగ్టన్‌: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ఇప్పటి నుంచే హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. డెమోక్రటిక్‌ పార్టీ నుంచి ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్‌ బరిలో ఉంటే.. రిపబ్లికన్ల నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పోటీ చేస్తున్నారు. అయితే.. జూన్‌ 27న నిర్వహించిన మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లోట్రంప్‌ ముందు బైడెన్‌ నిలువలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో రేసు నుంచి బైడెన్‌ను తప్పించాలనే ఒత్తిడి డెమోక్రటిక్‌ పార్టీపై నానాటికీ పెరుగుతున్నది. ఒక్కసారి అధ్యక్ష బరిలో నిలిచిన అభ్యర్థిని మార్చడం అంటే ఆషామాషీ కాదు. పెద్ద సాహసమే అవుతుంది. కానీ.. అలాంటి సాహసానికి సైతం డెమోక్రటిక్‌ పార్టీ సిద్ధపడుతున్నదనే వార్తలు వస్తున్నాయి. బైడెన్‌ బదులు మాజీ ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామాను బరిలో దింపే అంశంపై ఇప్పుడు అమెరికాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. బైడెన్‌ను మార్చివేయాలని టెక్సాస్‌ రిపబ్లికన్‌ సెనెటర్‌ టెడ్‌ క్రూజ్‌ చెబుతున్నారు. ఆయన స్థానంలో మిషెల్లీని నిలుపాలనేది ఆయన అభిప్రాయం. తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లోనే బైడెన్‌ పప్పులో కాలేశారని, యావత్‌ దేశంలోని డెమోక్రాట్లను తీవ్ర ఆందోళనకర స్థితికి నెట్టివేశారనేది ఆయన వాదన.
మిషెల్లీ గతంలో ఎన్నడూ రాజకీయ ఆకాంక్షలు వెలిబుచ్చింది లేదు. అధ్యక్ష స్థానం కోసం పోటీ చేస్తారని వచ్చిన వార్తలను ఆమె అనేక సందర్భాల్లో ఖండించారు. అయితే.. కొన్ని సమయాల్లో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్‌ ట్రంప్‌ను పరోక్షంగా ఉద్దేశించి.. 2024 ఎన్నికల గురించి తాను ఆందోళన చెందుతున్నానని చెప్పారు. ఇదెలా ఉన్నా.. ఆమె ఆసక్తి ప్రదర్శించకపోయినా ఈ తరుణంలో బైడెన్‌కు ప్రత్యామ్నాయంగా డెమోక్రాట్ల తరఫున మిషెల్లీ ఉత్తమ అభ్యర్థి అవుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ.. బైడెన్‌ను తప్పించి.. మిషెల్లీని నిలపడం కంటే.. బైడెన్‌ తనంతట తాను అభ్యర్థిత్వాన్ని వదులుకుంటేనే మంచిదని అంటున్నారు. ప్రచారం ఉధృతస్థాయిలో ఉన్న సమయంలో బైడెన్‌ను ఇప్పుడు బలవంతంగా తప్పించడం రాజకీయంగా డెమోక్రటిక్‌ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా పరిణమిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
డెమోక్రటిక్‌ పార్టీని బైడెన్‌ అనుయాయులే శాసిస్తున్నారు. కానీ.. బైడెన్‌ అంగీకరిస్తే.. మిషెల్లీ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా ట్రంప్‌ను సమర్థంగా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అదే సమయంలో బైడెన్‌ బదులు వైస్‌ ప్రెసిడెంట్‌ కమలాహారిస్‌ను ఎంపిక చేయడానికి కూడా ఇబ్బందికర వాతావరణమే ఉంటుందని అంటున్నారు. అన్ని ఒపీనియన్‌ పోల్స్‌లో బైడెన్‌ కంటే కమలా హ్యారిస్‌ వెనుకబడి ఉండటం పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
డెమోక్రాట్లకు ఆఫ్రో అమెరికన్లతోపాటు.. మహిళలు పెద్ద ఎత్తున మద్దతుదారులుగా ఉన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుంటే బైడెన్‌ను తప్పించే సమయంలో ఎదురయ్యే కుదుపును మిషెల్లీ అదుపు చేయగలరన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రత్యేకించి మిషెల్లీ ఆఫ్రో అమెరికన్‌ కావడం, కార్మిక కుటుంబం నుంచి పేదరికంలో ఎదిగి.. విజయవంతమైన న్యాయవాదిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా.. ప్రథమ మహిళగా పదేళ్లు వ్యవహరించిన కాలంలో ప్రజాభిమానాన్ని ఆమె మూటగట్టుకోవడం కూడా పార్టీకి కలిసి వస్తుందని చెబుతున్నారు. దీనితోపాటు పదేళ్లు అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్‌ ఒబామా.. మైనార్టీలు, యువత, మహిళ మద్దతు సాధించారు. పైగా ఎన్నికల ప్రచారంలో మిషెల్లీకి పెద్ద వనరుగా కూడా బరాక్‌ ఒబామా నిలుస్తారనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో గతానుభవంలో బరి నుంచి అభ్యర్థి తప్పుకొని మరొకరికి నిలబెట్టిన ఉదంతంలో ఓడిన అనుభవం డెమోక్రాట్లను హెచ్చరిస్తున్నది. 1968 ఎన్నికల్లో వియత్నాం యుద్ధ కాలంలో తీవ్ర ప్రజావ్యతిరేకత నేపథ్యంలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి లిండన్‌ బీ జాన్సన్‌ అనూహ్యంగా ఆరోగ్య కారణాలు చూపుతూ తన అభ్యర్థిత్వాన్ని వదులుకుంటున్నట్టు ప్రకటించారు. ఆయన స్థానంలో వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థి హ్యూబర్ట్‌ హంఫ్రేను ప్రకటించారు. కానీ.. హంఫ్రే విజయం సాధించలేక పోయారు. రిపబ్లికన్‌ పార్టీ నుంచి రిచర్డ్‌ నిక్సన్‌ గెలుపొందారు.

Latest News