మియాజాకీ మామిడి బంగారం ధ‌ర కంటే ఎక్కువే..! కిలో రూ. 2.50 ల‌క్ష‌ల‌పైనే..!!

  • Publish Date - April 4, 2024 / 09:54 AM IST

ఎండాకాలం వ‌చ్చిందంటే చాలు మామిడి పండ్లు గుర్తుకు వ‌స్తాయి. ఈ సీజ‌న్‌లో మామిడి పండ్ల పేరు విన్నా.. వాటిని చూసినా నోట్లో నీళ్లూరుతాయి. బంగారు ప‌సుపు వ‌ర్ణంలో ఉండే మామిడి పండ్ల‌ను ఎప్పుడు తినేయాలా..? అని అత్రుత ప‌డుతుంటాం. బంగిన‌ప‌ల్లి, తోతాపురి, ర‌త్న‌గిరి అల్ఫాన్సో, హిమాయ‌త్ వంటి ర‌కానికి చెందిన‌ మామిడి పండ్లు మ‌న‌కు తెలుసు. కానీ కొత్త ర‌కం మియాజాకీ మామిడి పండ్ల పేరు గ‌త రెండు, మూడేండ్ల నుంచి విన‌ప‌డుతోంది. మ‌ళ్లీ ఎండాకాలం రావ‌డంతో ఆ పండ్ల‌పై ఆస‌క్తి పెరిగింది. ఊదా రంగులో ఉండే ఈ పండ్ల ధ‌ర.. తులం బంగారం కంటే ఎక్కువే అని చెప్పొచ్చు.

తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల్లో దొరికి మామిడి పండ్ల రేటు మ‌హా అంటే కిలో రూ. 100 చొప్పున కొనుగోలు చేస్తాం. కానీ ఊదా రంగులో ఉండే ఈ మియాజాకీ మామిడి పండ్ల‌ను తినాలంటే అదృష్టం ఉండాలి. అంతేకాదు దీని ఖ‌రీదు కూడా ఎక్కువే. జ‌పాన్‌లో అత్య‌ధికంగా పండే మియాజాకీ ర‌కానికి చెందిన మామిడి పండ్లు మార్కెట్‌లో కిలో రూ. 2.50 ల‌క్ష‌ల చొప్పున‌ ప‌లుకుతున్నాయి. జ‌పాన్‌లోని మియాజాకీ ప్రాంతంలో పండ‌టం వల్ల ఈ మామిడికి మియాజాకీ అని పేరు వ‌చ్చింది. దీన్నిసూర్యుడి గుడ్లు(ఎగ్స్ ఆఫ్ స‌న్) అనికూడా పిలుస్తారు. సువాస‌న‌లు వెద‌జల్లుతూ లోపల బంగారు ఛాయ‌తో మెరిసిపోయే ఈ మామిడి పండు అత్య‌ధిక పోష‌కాల‌ను క‌లిగి ఉంటుంద‌ట‌. దీని విలువ అంత‌ర్జాతీయ మార్కెట్‌లో కేజీ రూ. 2.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌లుకుతుంది.

ఈ మామిడికి ఎందుకు ఇంత ధర అని అనిపిస్తోందా? ప్రత్యేక కారణాలున్నాయి. ఈ పండు ఒక్కోటీ 350 గ్రాములకు పైగా బరువు ఉంటుంది. మామూలు మామిడి పండ్ల కంటే ఇందులో తీపిదనం 15 శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఇది క్యాన్స‌ర్‌కు మందుగా, కొలెస్ట్రాల్ త‌గ్గించే ఔష‌ధంగా పేరొంద‌డంతో దీనికి మ‌రింత విలువ పెరిగింది. జ‌పాన్ దేశంలో మాత్ర‌మే పండే ఈ మియాజాకీ ర‌కం మామిడి ఇప్పుడు ఇండియాలోనూ పండిస్తున్నారు. తెలంగాణ‌, ఏపీ, క‌ర్ణాట‌క‌, మధ్య‌ప్ర‌దేశ్‌తో పాటు ప‌లు రాష్ట్రాల్లో మియాజాకీ మామిడిని సాగు చేస్తున్నారు. ఈ మామిడి పండ్ల‌కు ధ‌ర ఎక్కువ‌గా ఉండ‌డంతో పాటు డిమాండ్ కూడా ఉంది. దీంతో ఈ మియాజాకీ చెట్ల‌కు రైతులు ప్ర‌త్యేక భ‌ద్ర‌త ఏర్పాటు చేసుకుంటున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో అయితే ఈ చెట్ల‌కు కుక్క‌ల‌ను కాప‌లాగా ఉంచారు.

Latest News