న్యూఢిల్లీ : యెమెన్ లో ఉరిశిక్ష ఎదుర్కోంటున్న కేరళ నర్సు నిమిష ప్రియకు ఆఖరి నిమిషాల్లో అనూహ్య ఊరట దక్కింది. ఆమె ఉరిశిక్ష వాయిదా వేసినట్లుగా యెమెన్ తెలిపింది. ఆమె ఉరిశిక్ష రద్దు కోసం భారత్ ప్రభుత్వం యెమెన్ తో చర్చలు జరుపుతుంది. నిమిషను రక్షించేందుకు భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం కేంద్రం చేసిన ప్రయత్నాలను అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సుప్రీంకోర్టుకు వివరించారు. దౌత్యపర మార్గాలతో పాటు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆమె తరఫు న్యాయవాది వెల్లడించారు.
మరోవైపు నిమిష ఉరిశిక్షను ఆపేందుకు బాధిత కుటుంబానికి ‘బ్లడ్ మనీ (క్షమాధనం)’ చెల్లింపు మార్గంపై కూడా చర్చలు జరుపుతున్నారు. నిమిషకు శిక్ష పడకుండా చేయగలిగేందుకు ఏకైకమార్గంగా ఉన్న బ్లడ్ మనీ చెల్లింపుకు బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామనని న్యాయవాది శుభాష్ చంద్రన్ ఇప్పటికే తెలిపారు. ఈ కేసులో గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అబూబకర్ ముస్లియార్ మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బాధిత కుటుంబంతో పాటు యెమెన్ స్థానిక అధికారులు, అక్కడి మత పెద్దలతో ఆయన మాట్లాడుతున్నారని చెప్పారు. హూతీల పాలనలో ఉన్న యెమెన్ చట్టాలను అనుసరించి నేరస్థురాలిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష రద్దు చేస్తారు. అలాగే ఆ కుటుంబం బ్లడ్‌మనీకి అంగీకరిస్తే అది సాధ్యమవుతుంది. ఈ విషయంలో నిమిష కుటుంబం.. బాధితులతో సంప్రదింపులు సాగించింది.
గతేడాది నిమిష తల్లి ప్రేమకుమారి యెమెన్ వెళ్లారు. తనకున్న పరిచయాల ఆధారంగా బ్లడ్‌మనీ ఇచ్చి, తన కుమార్తెను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రియ కుటుంబం మిలియన్ డాలర్లు (రూ.8.6 కోట్లు)ను బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ, ఇందుకు వారు గతంలో అంగీకరించలేదని సమాచారం. కేంద్రంతో పాటు మతగురువు ద్వారా నిమిష కుటుంబం చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో యెమన్ ప్రభుత్వం ఆమె ఉరిశిక్షను వాయిదా వేయడంతో ఉరిశిక్షను తప్పించేందుకు చేస్తున్న వారి ప్రయత్నాలకు మరికొంత సమయం చిక్కినట్లయ్యింది.