Site icon vidhaatha

పిల్ల‌ల‌ను ఫేస్‌బుక్ పిచ్చివాళ్లుగా చేస్తోంది..కోర్టుకెక్కిన 30 అమెరికా రాష్ట్రాలు

విధాత‌: యువ‌త మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డ‌టంలో ఫేస్‌బుక్ (Facebook) మాతృసంస్థ మెటా (Meta) పాత్ర కూడా ఉంద‌ని ఆరోపిస్తూ అమెరికా (America) లోని 30 రాష్ట్రాలు ఆ సంస్థ‌పై కేసు వేశాయి. చిన్నారులను పిచ్చి వాళ్ల‌ను చేసి వారు ప‌డే బాధ‌ల నుంచి ఆ సంస్థ డ‌బ్బు చేసుకుంటోంద‌ని అవి ఆరోపించాయి. దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్ర‌భుత్వాలు మెటాపై కొన్ని నెల‌లుగా ద‌ర్యాప్తు చేశాయి. ఆ సంస్థ విధివిధానాల‌ను చిన్నారుల‌కు, టీనేజర్ల‌కు ప్రాణాంత‌కంగా ఉన్నాయ‌ని.. ఇంట‌ర్నెట్‌కు బానిస‌లా మారేలా వారిని ప్రోత్స‌హిస్తున్నాయ‌ని ఆ ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది.


మొత్తం 40 అమెరికా రాష్ట్రాల్లో 33 రాష్ట్రాలు ఫెడ‌ర‌ల్ కోర్టులో ఫిర్యాదు దాఖ‌లు చేయ‌గా.. మిగ‌తావి స్థానిక కోర్టుల్లో పోరాడ‌నున్నాయి. బాగా డ‌బ్బులు సంపాదించ‌డానికి వినియోగ‌దారుల‌ను మెటా ప‌క్క‌దారి ప‌ట్టిస్తోంది. వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించడం, నిల‌బెట్ట‌కోవ‌డం, బానిస‌లుగా చేయ‌డానికి ఆ సంస్థ అనేక సాంకేతిక‌త‌ల‌ను ఉప‌యోగిస్తోంది. దీనికోసం వారి ద‌గ్గ‌ర ఒక ప్ర‌త్యేక వ్య‌వ‌స్థే ఉంది అని రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌మ పిటిష‌న్‌లో పేర్కొన్నాయి.


టీనేజ‌ర్లు ఇక ఏ విష‌యం గురించీ ప‌ట్టించుకోకుండా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాల‌కు అతుక్కుపోవ‌డాన్ని త‌మ ద‌ర్యాప్తులో గుర్తించామ‌ని అవి వెల్ల‌డించాయి. మెటాకు బానిస‌లైన వారు ఒత్తిడి, ఆందోళ‌న, నిద్ర‌లేమి, చ‌దువులో వెనుక‌బ‌డ‌టం త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని దర్యాప్తులో తేలిన‌ట్లు ప్ర‌భుత్వాలు పేర్కొన్నాయి. ఇత‌రుల నుంచి లైక్‌లను కోరుకునే టీనేజ‌ర్ల బ‌ల‌హీన‌త‌ను మెటా ఒక ఆయుధంగా ఉప‌యోగించుకుంటోంద‌ని ఆరోపించాయి.


అంతే కాకుండా 13 ఏళ్ల లోపు చిన్నారుల స‌మాచారాన్ని సేక‌రించ‌కూడ‌దనే నిబంధ‌న‌నూ ఆ సంస్థ గాలికొదిలేసింద‌ని తెలిపాయి. మెటాపై భారీ జ‌రిమానా విధించ‌డం లేదా అభ్యంత‌ర‌క‌ర‌మైన విధానాల‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌ని కోర్టులు ఆదేశించే అవ‌కాశ‌ముంద‌ని ఒక న్యాయ నిపుణుడు వెల్ల‌డించారు. ఈ ప‌రిణామాల‌పై తాము తీవ్ర నిరాశ చెందామ‌ని మెటా ప్ర‌క‌టించింది.


వ్య‌వ‌స్థాగ‌త స‌మ‌స్య‌ల‌కు త‌మ సంస్థ‌ను మాత్ర‌మే బాధ్యుల్ని చేయ‌డం బాధ‌గా ఉంద‌ని తెలిపింది. ఈ క్ర‌మంలో టీనేజ‌ర్ల హ‌క్కుల‌ను కాపాడేందుకు తాము చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను వివ‌రించింది. ఇప్ప‌టికే 30 అత్యాధునిక మైన టూల్స్‌ను విడుద‌ల చేశామ‌ని.. వీటి ద్వారా త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల ఆన్‌లైన్ యాక్టివిటీని నియంత్రించొచ్చ‌ని తెలిపింది.

Exit mobile version