Site icon vidhaatha

Air India: విమాన ప్రమాద సంక్షోభం.. టాటా వ్యాపారవేత్తలు ఏమన్నారంటే

ముంబయి: గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో ఇటీవల AI171 విమాన ప్రమాదం తర్వాత, టాటా గ్రూప్ అనుసరించిన సంక్షోభ నిర్వహణ విధానంపై వ్యాపారవేత్తలు, విమానయాన పరిశ్రమ నిపుణులు స్పందిస్తున్నారు. దశాబ్ద కాలంలో భారతదేశంలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా నిలిచిన ఈ దుర్ఘటనను టాటా గ్రూప్ నిర్వహించిన తీరును పలువురు ప్రముఖులు ప్రశసించారు. జూన్ 12న జరిగిన ఈ విమాన ప్రమాదం దాదాపు 270కిపైగా ప్రాణాలను బలిగొంది. ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా మాట్లాడుతూ.. ఈ సంఘటనను 2008 ముంబై ఉగ్రవాద దాడులతో పోల్చారు. “ఇక్కడే టాటా గ్రూప్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎటువంటి వాదనలు లేవు” అని పేర్కొన్నారు.

బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ సర్వీసులోకి ప్రవేశించిన తర్వాత జరిగిన మొదటి ప్రాణాంతక ప్రమాదంగా ఈ దుర్ఘటన గుర్తించారు. జెట్ ఎయిర్‌వేస్ మాజీ సీఈఓ సంజీవ్ కపూర్ ఎయిర్ ఇండియా భద్రతా ప్రమాణాలపై విమర్శలు చేస్తున్న వారికి సవాలు విసిరారు. “ఎయిర్ ఇండియా దశాబ్దాలుగా అద్భుతమైన భద్రతా రికార్డును కలిగి ఉంది. ఒక విషాదం చాలు, చాలామంది తమ వివేకాన్ని కోల్పోతారు” అని విమర్శలు సంధించారు.

బోయింగ్ 787 విమానాలు ప్రపంచవ్యాప్తంగా 5 మిలియన్లకు పైగా విమాన యాత్రలు పూర్తి చేశాయని, గతంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని కపూర్ పేర్కొన్నారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఒక ఇంటర్వ్యూలో నియంత్రణ పర్యవేక్షణపై విశ్వాసం వ్యక్తం చేశారు. “భద్రతా సమస్యలుంటే, డీజీసీఏ విమానాన్ని ఎగరడానికి అనుమతించేది కాదు” అని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలిచేందుకు టాటా గ్రూప్ సహాయ కార్యక్రమాలను అందించడంతో పాటు ఒక్కో కుటుంబానికి రూ.కోటి పరిహారాన్ని అందించనున్నట్లు ప్రకటించింది.

ప్రభుత్వ సత్వర స్పందన..

ఈ ఘటన తరువాత.. పౌర విమానయాన శాఖా మంత్రి కింజరపు రామ్ మోహన్ నాయుడు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గుజరాత్ ప్రభుత్వం తక్షణమే రెస్క్యూ బృందాలను మోహరించింది. విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో సాంకేతిక నిపుణులను సైట్‌లో నియమించింది. బ్లాక్ బాక్స్ రికవరీతో ఒక పురోగతి లభించింది. హోం కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ మూడు నెలల్లో సమగ్ర నివేదికను అందించనుంది. భారత్‌లో మొత్తం 34 బోయింగ్ 787 విమానాలపై నిఘాను విస్తరించాలని DGCA ఆదేశించింది.

Exit mobile version