చిన్నారుల ఆకలికేకలు!

  • Publish Date - April 10, 2024 / 11:31 AM IST

24 గంటల్లో ఆహారం తీసుకోని చిన్నారుల సంఖ్యలో మూడో స్థానం!
ప్రపంచ ఆకలి సూచీలో మన ర్యాంకు 111!
వయసుకు తగ్గ బరువులేని 32% పిల్లలు
పేద ప్రజల్లో పీడిస్తున్న రక్తహీనత సమస్య
కొలువల భర్తీలేక, తగిన వేతనాలు లేక
కునారిల్లుతున్న అంగన్‌వాడీ వ్యవస్థ
ఆహార సబ్సిడీ కేటాయింపుల్లో క్షీణత
ఇదేనా వికిసిత్‌ భారత్‌?

మీకు తెలుసా? గడిచిన 24 గంటల్లో ఆహారం తీసుకోని చిన్నారుల సంఖ్యలో భారతదేశానికి మూడో స్థానం! మీకు తెలుసా? 2023 ప్రపంచ ఆకలి సూచీలో 125 దేశాలకు గాను భారతదేశ ర్యాంకు 111! మీకు తెలుసా? దేశంలో 32శాతం మంది చిన్నారులు తక్కువ బరువును కలిగి ఉన్నారు. మీకు తెలుసా? ఎప్పుడో 2018లోనే ఎనీమియా రహిత భారతదేశం కోసం చర్యలు తీసుకున్నా.. ఇప్పటికీ 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఆడవారిలో రక్తహీనత సమస్య కనిపిస్తున్నది. మీకు తెలుసా? వెలుగుల గుజరాత్‌గా చెప్పుకొనే మోదీ సొంత రాష్ట్రంలో ఆరు నుంచి 59 నెలల వయసున్న చిన్నారుల్లో రక్తహీనత అత్యధికంగా 80% మందిలో ఉన్నది! కానీ.. ఈ దేశం వికసిత భారతదేశం! మళ్లీ బీజేపీనే గెలిపించాలని దేశ ఓటర్లు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారని ప్రధాని మోదీ ప్రవచిస్తున్న సమయం!

(విధాత ప్రత్యేకం)

చిన్నారులు ఎదుర్కొంటున్న పోషకాహార లేమి వంటి సమస్యలను పరిష్కరిస్తామని పదేళ్ల క్రితం బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇప్పటికి రెండు పర్యాయాలు.. మొత్తంగా పదేళ్లు గడిచిపోయాయి. మరి బీజేపీ హామీ ఏమైంది? లెక్కలు చెబుతున్న వాస్తవాలేంటి? ఈ ఏడాది జనవరిలో ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద కుటుంబాలకు 5 కేజీల ఆహార ధాన్యాలు ఇచ్చే పథకాన్ని మోదీ ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగించింది. ఆ సమయంలో అదొక చారిత్రాత్మక నిర్ణయమని, దేశంలో ఆహార, పోషకాహార భద్రతను బలోపేతం చేయడం పట్ల ప్రధాని మోదీ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నదని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొన్నది. కానీ.. ప్రభుత్వ లెక్కలు, కేటాయింపులు పూర్తిగా భిన్న దృశ్యాన్ని చూపుతున్నాయి. అందుబాటులో ఉన్న ప్రభుత్వ పత్రాలు, వివిధ ప్రకటనలు ఆధారంగా ఫైనాన్షియల్‌ అక్కౌంటబిలిటీ నెట్‌వర్క్‌ ఇండియా (ఎఫ్‌ఏఎన్‌) ఆహార భద్రత, పోషకాహార రిపోర్ట్‌ కార్డు 2014-25 పేరిట ఒక నివేదికను రూపొందించింది. దేశంలో చిన్నారులు ఎదుర్కొంటున్న దుస్థితిని కళ్లకు కట్టింది. దేశంలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో 36శాతం మంది వారి వయసుకు తగిన ఎత్తు కలిగి లేరని జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే (ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌) తాజా నివేదిక పేర్కొంటున్నది. ఇది తీవ్ర పోషకాహార లేమి సంకేతమని స్పష్టం చేసింది. ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల్లో 32శాతం మంది తగిన బరువు కలిగి లేరని ఎఫ్‌ఏఎన్‌ రిపోర్ట్‌ కార్డ్‌ వెల్లడించింది.

15-49 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళల్లో రక్తహీనత సమస్య

2018లో రక్తహీనత రహిత భారతదేశం (ఎనీమియా ముక్త భారత్‌) కోసం చర్యలు తీసుకున్నా.. 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఆడవారిలో రక్తహీనత సమస్య కనిపిస్తున్నది. 2015-16లో అది 53శాతం ఉంటే.. 2019-20 నాటికి 57.2 శాతానికి పెరిగినట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేర్కొంటున్నది. 67శాతం చిన్నారుల్లో రక్తహీనత 67శాతం చిన్నారులు ఒక మేరకు రక్తహీనతతో (హిమోగ్లోబిన్‌ స్థాయి 11 కంటే తక్కువ ఉండటం) బాధపడుతున్నారు. అన్నింటికి మించి.. మోదీ ప్రభుత్వ హయాంలో 2015-16, 2019-21 మధ్యకాలంలో ఆరు నుంచి 59 నెలల వయసున్న చిన్నారుల్లో రక్తహీనత 59 శాతం నుంచి 67 శాతానికి పెరిగింది. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ‘మోడల్‌ స్టేట్‌’గా బీజేపీ ఊదరగొట్టిన మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఆరు నుంచి 59 నెలల వయసున్న చిన్నారుల్లో రక్తహీనత అత్యధికంగా 80% మందిలో ఉన్నదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలు పేర్కొంటున్నాయి. ప్రత్యేకించి నర్మద (93.2%), పంచ్‌మహల్‌ (91%), ఆరావళి (89.5%) జిల్లాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నది. పట్టణ, గ్రామీణ పేదల్లో బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీల పరిస్థితి ఆహార భద్రత విషయంలో అత్యంత దారుణంగా ఉన్నది. ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌ డాటా ఆధారంగా ఆర్థికవేత్త దీపా సిన్హా చేసిన అధ్యయనాన్ని ఎఫ్ఏఎన్‌ రిపోర్ట్‌ కార్డ్‌ ప్రస్తావించింది. ఇతర గ్రూపులలోని చిన్నారుల్లో రక్తహీనత సమస్య 30శాతం మందిలో ఉంటే.. ఎస్సీ, ఎస్టీల్లో అది 40శాతం మందిలో ఉండటం దిగ్భ్రాంతి కలిగించే అంశమని పేర్కొన్నది.

24 గంటలుగా అన్నం తినని చిన్నారుల సంఖ్యలో మనది మూడో స్థానం

జేఏఎంఏ నెట్‌వర్క్‌ ఓపెన్‌ జర్నల్‌ 2024 ఫిబ్రవరిలో విడుదల చేసిన అధ్యయన నివేదికను కూడా ఎఫ్‌ఏఎన్‌ రిపోర్ట్‌ కార్డు ప్రస్తావించింది. గడిచిన 24 గంటల్లో ఎలాంటి ఆహారం తీసుకోని ఆరు నుంచి 23 నెలల వయసున్న చిన్నారుల సంఖ్యలో భారతదేశం మూడో స్థానంలో ఉన్నదని జేఏఎంఏ నెట్‌వర్క్‌ ఓపెన్‌ జర్నల్‌ విస్మయకర వాస్తవాలను వెల్లడించింది. మరి మోదీ ప్రభుత్వం చెబుతున్నట్టు తల్లి, పిల్లలను నేరుగా ప్రభావితం చేసే పోషకాహార పథకాలకు కేటాయింపులు పెరగలేదా?

తగ్గిపోతున్న బడ్జెట్‌ కేటాయింపులు

మోదీ నాయకత్వంలో జరుగుతున్న వ్యయం వాస్తవ పరిస్థితిని గమనిస్తే.. ఇప్పుడు పీఎం పోషణ్‌గా మార్చిన ఒకప్పటి మధ్యాహ్న భోజనం పథకానికి చేస్తున్న వ్యయం 2013-14లో 0.79% ఉంటే.. 2024-25 నాటికి అది 0.23 శాతానికి పడిపోయింది. తినే తిండిని సైతం కాషాకీయకరించే ప్రయత్నాల్లో అనేక రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజనంలో అందించే కోడిగుడ్డు ఎగిరిపోయింది. చిన్నారుల ఎదుగుదల, పోషకాహారలేమి, ఆరోగ్య క్షీణత అంశాలను ఎదుర్కొనడంలో గుడ్డు గొప్ప కీలక పాత్ర పోషిస్తాయని ఎఫ్‌ఏఎన్‌ రిపోర్ట్‌ కార్డ్‌ పేర్కొన్నది. జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే-4కు, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -5కు మధ్యలో 21 రాష్ట్రాల్లో ఎదుగుదల సమస్యను ఎదుర్కొంటున్న చిన్నారుల సంఖ్య ఎందుకు పెరిగిందో అర్థం చేసుకునేందుకు పైన పేర్కొన్న అంశాలు చాలు.

తగ్గిపోయిన పీఎం మాతృవందన యోజన లబ్ధిదారులు

బీజేపీ సర్కారు గొప్పగా చెప్పుకొనే ప్రధాన మంత్రి మాతృవందన యోజన పథకం లబ్ధిదారులు 2019-20లో 96 లక్షలు ఉంటే.. 2021-22 నాటికి వారి సంఖ్య 61 లక్షలకు పడిపోయిందని ఆర్టీఐ ప్రశ్నకు అందిన జవాబు ద్వారా తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ పథకం కింద మహిళలు నెలకు 5వేల రూపాయలు అందుకుంటున్నారు. అయితే.. జాతీయ ఆహార భద్రత చట్టం కింద వారికి ఆరు వేల రూపాయలు అందాల్సి ఉన్నది.

అంగన్‌వాడీ వ్యవస్థపై చిన్నచూపు

దేశవ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్య, వారికి పోషకాహారం అందించడంపై అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ.. ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయక ఉన్న కొద్దిమందిపైనే భారం పడుతున్నది. దానికితోడు వారికి ఇచ్చే గౌరవ వేతనాలు, ఇతర ప్రయోజనాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా 70,444 అంగన్‌వాడీ వర్కర్ల పోస్టులు, 1,23,287 హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దీనికి తోడు ప్రజాపంపిణీ వ్యవస్థ కింద ఇచ్చే ఆహార సబ్సిడీల బడ్జెట్‌ కేటాయింపు 3.33శాతం తగ్గిపోయింది. 2023-24లో 2.12 లక్షల కోట్లు ఉంటే.. అది 2024-25లో 2.05 లక్షల కోట్లకు పడిపోయింది. మొత్తంగానే పదేళ్ల మోదీ పాలనలో ఆహార సబ్సిడీలకు కేటాయింపులు 2014-15లో 6.4శాతం ఉంటే.. 2024-25 నాటికి 4.3శాతానికి తగ్గిపోయాయి.

Latest News