Raksha Bandhan | రాఖీ కట్టడానికి, విప్పడానికి కూడా నియమాలున్నాయని తెలుసా..?
ప్రతీ పండుగ, ఏదో ఒక శుభసందర్భాన్ని పురస్కరించుకుని, దాన్ని మరవకుండా ఉత్సవం చేసుకోవడం కోసం ఏర్పడిందే. దసరా, దీపావళి, సంక్రాంతి..ఇలా. రక్షాబంధన్ కూడా అలాంటిదే. అయిదే ఇది రాష్ట్రాల సంప్రదాయంగా కాకుండా దేశవ్యాప్తంగా సోదరసోదరీమణులు జరుపుకునే ఏకైక ఉత్సవం.
శ్రావణ(Sravana) మాసంలో వచ్చే పౌర్ణమి(Full Moon Day) రోజున రాఖీ పండుగ(Raksha Bandhan)ను యావద్దేశం జరుపుకుంటుంది. ఈ పండుగ అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముల్ల మధ్య ప్రేమకు ప్రతీక(Festival of Brothers and Sisters). ఈ రోజున తమ అన్నదమ్ముల ఆయురారోగ్యైశ్వరాలను కోరుతూ, అక్కచెల్లెళ్లు వారి కుడి మణికట్టుకు రక్ష కడతారు. ఇది తమ తోబుట్టువులకు ఎలాంటి ఆపదా రాకుండా కాపాడుతుందని సోదరీమణుల నమ్మకం. తమ క్షేమం కోసం రక్ష కట్టిన అక్కాచెల్లెళ్లకు కృతజ్ఞత తెలియజేస్తూ, అన్నదమ్ములు తమకు చేతనైనంతలో బహుమతులు అందిస్తారు. అన్ని సమయాల్లో తమ అక్కచెల్లెళ్లకు ఎప్పుడూ తోడుగా ఉంటామని ప్రతినబూనుతారు.
రక్షాబంధన్ రోజు శుభసమయాన, సోదరుల(Brothers)ను తూర్పు అభిముఖం(East facing)గా కూర్చోబెట్టి, అక్కాచెల్లెళ్లు(Sisters) పడమర ముఖం(West faced)గా నిల్చుని రాఖీ కట్టడం ప్రశస్తంగా పరిగణించబడుతుంది. ముందుగా ఓ చాప వేసి, దాని మీద పీట(లు) వేసి, సోదరులను కూర్చోబెట్టాలి. తర్వాత వారికి బొట్టు పెట్టి, అక్షతలు వేసిన తర్వాతే రాఖీ కట్టాలి. అప్పుడు వారి నోరు తీపి చేయాలి. కట్టింది అన్నయ్యకైతే, అక్షతలు తన చేతికిచ్చి, పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకోవాలి. తమ్ముడైతే అక్కకే పాదాభివందనం చేసి సోదరి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇక్కడ సోదరులకు వివాహమై ఉంటే, వదినలు, మరదళ్లు కూడా వరుసను, వయసును బట్టి ఆశీర్వాదాలు తీసుకోవచ్చు.

ఈ సంవత్సరం, రాఖీ పండుగ 19 ఆగస్టున(19th August 2024) వస్తోంది. ఆరోజు పౌర్ణమి తెల్లవారుఝామున గం. 3.06ని.లకు ప్రారంభమై, రాత్రి 11.56 ని.లకు ముగుస్తుంది. రక్షబంధన్కు అనుబంధంగా ఎప్పుడూ భద్రకాలం ఉంటుంది. ఇది శుభసమయం కాదు. అంటే ఈ సమయంలో రాఖీ కట్టకూడదు. అది వెళ్లిపోయాకే రక్షాబంధనం కావించాలి. ఈ ఏడాది భద్రకాలం సోమవారం మధ్యాహ్నం 1.30 గం.ల వరకు ఉంటోందని జ్యోతిష్య నిపుణులు చెపుతున్నారు. కాబట్టి ఒంటిగంటన్నర తర్వాతే రాఖీ కట్టడం శుభప్రదం. అప్పటినుండి రాత్రి 9.07 గంటల వరకు శ్రేష్టమైన సమయం. అందునా, ప్రత్యేకించి మధ్యాహ్నం 1.30 నుండి మధ్యాహ్నం 3.37 వరకైతే మరింత ప్రశస్తమైన ముహుర్తంగా పండితులు పేర్కొంటున్నారు. అంటే దాదాపు 2 గంటల సమయం. ఆ తర్వాత సాయంత్రం 6.56 నుండి రాత్రి 9.07 వరకు మరో ముహుర్తం. ఈ ముహుర్తాలలో కార్యక్రమం పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే సర్వశ్రేష్టం. అంటే..
- మధ్యాహ్నం 1.30 నుండి మధ్యాహ్నం 3.37 వరకు, ఆ తర్వాత,
- సాయంత్రం 6.56 నుండి రాత్రి 9.07 వరకు శుభప్రదమైన కాలాలు.
ఇక, భద్రకాలమంటే ఏంటనే సందేహం ఎవరికైనా రావచ్చు. దీని గురించి రెండు కథలు పురాణాల్లో ఉన్నాయి. ఒకటి రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ మరోపేరు భద్ర. ఈమె రక్షాబంధనం రోజు అశుభ సమయం చూసుకోకుండా రావణుడికి రక్ష కట్టిందని, దాని ఫలితమే రావణాసుర వధ అని ఒక గాథ ప్రచారంలో ఉంది. మరోటి భద్ర సూర్య దేవుని కుమార్తె. ఈమె రాక్షసులను నాశనం చేయడానికి జన్మించింది. తను జన్మించిన సమయంలోనే విశ్వం మారిపోనారంభించింది. ఆ సమయంలో శుభకార్యాలు ఎక్కడ జరిగినా అక్కడ ఇబ్బందులు ఎదురవుతాయని ఓ విశ్వాసం. అందుకే ఆ సమయంలో శుభకార్యాలను నిలిపివేస్తారు. అప్పుడు ఎలాంటి పనులు చేపట్టినా విజయవంతం కావలని ప్రజల నమ్మకం.

రక్ష లేదా రాఖీ కట్టించుకున్న ఓ రెండు రోజులు సోదరులందరూ ఉత్సాహంగా దాన్ని చేతికి ఉంచుకుని, ఆ తర్వాత తీసేస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రక్షను ఒకటి లేదా రెండు రోజుల తర్వాత విసర్జించడం తప్పు, అశుభం.
రక్షాబంధన్ తర్వాత రాఖీని సోదరులు కనీసం 21 రోజులు(Keep at least for 21 days) చేతికి ఉంచుకోవాలి. ఇన్ని రోజులు రాఖీ చేతికి ఉంచుకోలేకపోతే కనీసం శ్రీకృష్ణ జన్మాష్టమి (26 ఆగస్టు) వరకు అయినా ఉంచుకోవాలి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాఖీని తీసివేసిన తర్వాత దానిని ఎక్కడా పడేయకుండా ఆ రక్షను ఎర్రటి వస్త్రంలో చుట్టి ఏదైనా పవిత్ర స్థలంలో లేదా మీ సోదరికి సంబంధించిన వస్తువులతో ఉంచండి. మళ్ళీ వచ్చే రాఖీ పండగ వరకు ఉంచండి. తరువాత ఆ రాఖీని ప్రవహిస్తున్న నీటిలో వదిలేయండి.
(ఈ వివరాలన్నీ సనాతన ధర్మ పురాణాలు, జ్యోతిష్యశాస్త్ర పండితుల ప్రవచానాలననుసరించి ఇవ్వబడ్డాయి. వీటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. మతవిశ్వాసాలను నమ్మి, అనుసరించేవారికోసం వివిధ గ్రంథాలనుండి సేకరించి ఇవ్వడమైనది. విధాత వీటిని ధృవీకరించదు)
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram