Yadagirigutta| కమనీయం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుల కల్యాణం

తెలంగాణ ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి స్వామి, అమ్మవార్ల తిరు కల్యాణ మహోత్సవం కన్నుల విందుగా సాగింది. లోక కల్యాణకారకులు శ్రీలక్ష్మీ నరసింహుల పరిణయ ఘట్టాన్ని తిలకించిన భక్తజనం భక్తి పారవశ్యంతో పులకించారు.

Reported by: Y.V. Narsimha Reddy | ఆధ్యాత్మికం | Apr 04, 2026, 1:15 pm IST
Read Time: 6 mins
Yadagirigutta| కమనీయం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుల కల్యాణం

(వై. వెంకటనరసింహారెడ్డి)

తెలంగాణ ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి(Yadagirigutta Lakshmi Narasimha Swamy) దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి స్వామి, అమ్మవార్ల తిరు కల్యాణ మహోత్సవం (Kalyanam) కన్నుల విందుగా సాగింది. సింహలగ్నంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం యాజ్ఞిక,అర్చక పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య లక్ష్మీనారసింహుల తిరుకల్యాణ మహోత్సవం ఘట్టాన్ని ఆధ్యంతం వైభవంగా నిర్వహించారు. లోక కల్యాణకారకులు శ్రీలక్ష్మీ నరసింహుల పరిణయ ఘట్టాన్ని తిలకించిన భక్తజనం భక్తి పారవశ్యంతో పులకించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం, భూదాన్‌పోచంపల్లి చేనేత కార్మికులు, భువనగిరి స్వర్ణగిరి ఆలయం తరఫున లక్ష్మీనరసింహులుకు కల్యాణ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎస్పీ అక్షాంశ్‌యాదవ్‌ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ఆలయ ధర్మకర్త నరసింహమూర్తి దంపతులు, ఈవో భవానీశంకర్‌ ఆలయ పక్షాన పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.

ప్రధాన పూజారులు తమ ఆచార్య బృందంతో విష్వక్సేన ఆరాధనతో కల్యాణ పర్వానికి శ్రీకారం చుట్టారు. తొలుత ప్రధానాలయంలో సయంభువులకు ప్రత్యేక ఆరాధన జరిపిన అర్చక పండితులు కల్యాణ వేడుకను విష్వక్సేన ఆరాధన అగ్ని, జలపూజ, మండప శుద్ధి క్రతువులతో ప్రారంభించారు. గజ వాహనంపై పెళ్లి కొడుకుగా నారసింహుడు, ముత్యాలపల్లకిపై క్షీర సముద్ర రాజ తనయ లక్ష్మీదేవి రత్న ఖచిత స్వర్ణాభరణ ధారణతో ముస్తాబై.. తిరువీధిలోని కల్యాణ మండపానికి చేరుకోగా, పూజారులు ఎదుర్కొని పాంచరాత్ర ఆగమశాస్త్ర రీత్యా కల్యాణ ఘట్టాన్ని నిర్వహించారు.

గరుడాళ్వార్ ఆహ్వానంతో కొండపైకి వేంచేసి విడిది చేసిన బ్రహ్మాది దేవతలు, సుర మునులు భక్తజనులు లక్ష్మీ నరసింహ కళ్యాణ ఘట్టాన్ని వీక్షించి తరించారు. గంగా, కావేరి, కృష్ణ, గోదావరి, యమున పుణ్య నదుల జలాల ఆవాహన, సంప్రోక్షణ, రక్షాబంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీత ధారణ, మధుపర్క నివేదన, నూతన వస్త్రాలంకరణ, జీలకర్ర బెల్లం ధారణ, కన్యాదాన ఘట్టాలతో అధ్యంతం కన్నుల పండుగగా లక్ష్మీ నరసింహుల కళ్యాణం నేత్రపర్వంగా సాగింది.

లక్ష్మీదేవి తండ్రి సముద్రుడు వరుడు నారాసింహుడి కాళ్లు కడిగి కన్యాదానం చేసిన ఘట్టాన్ని యాజ్ఞిక బృందం నిర్వహించింది. యాజ్ఞిక పండితులు కళ్యాణమూర్తులైన లక్ష్మీనరసింహులకు బ్రహ్మ ముడులు వేసి భక్తుల గోవింద నామస్మరణల మధ్య… బ్రహ్మాది సకల దేవతలందరి సమక్షంలో మాంగళ్యధారణ క్రతువు నిర్వహించారు. అనంతరం తలంబ్ర ధారణ ఘట్టం సాగింది.

స్వామివారి కల్యాణ ఘట్టాన్ని వీక్షించిన భక్తుల గోవింద నామస్మరణలతో కొండ పరిసరాలు మారుమోగాయి. అర్చక బృందం కళ్యాణమూర్తులైన లక్ష్మీనరసింహులకు మంగళ నీరాజనాలు, ఆశీర్వచనాలు అందించాక గజవాహనంపై మాడవీధుల్లో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. విశ్వశాంతికి కళ్యాణోత్సవంతో ఒక్కటైన స్వామి అమ్మవార్లు ప్రసన్నమూర్తులై భక్తులకు తమ దర్శనంతో అనుగ్రహించారు. తిరువీధుల్లో ఊరేగాక స్వామి అమ్మవారు తిరిగి ఆలయం చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల పర్వంలో 26న దివ్యవిమాన రథోత్సవం, 28న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలుకనున్నారు.