Tresa । రెవెన్యూ అధికారులపై ముందస్తు అనుమతి ఉంటేనే కేసులు : డీజీపీకి ట్రెసా వినతి

వివిధ జిల్లాల్లో విధి నిర్వహణలో భాగంగా రెవెన్యూ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలపై అక్కడక్కడ ఎవరో ఫిర్యాదు చేశారని కేసులు నమోదు చేస్తున్నారని, పై అధికారుల ముందుస్తు అనుమతి లేనిదే కేసులు నమోదు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీ జితేందర్‌కు ట్రెసా నేతలు విజ్ఞప్తి చేశారు.

Tresa । రెవెన్యూ అధికారులపై ముందస్తు అనుమతి ఉంటేనే కేసులు : డీజీపీకి ట్రెసా వినతి

Tresa । వివిధ జిల్లాల్లో విధి నిర్వహణలో భాగంగా రెవెన్యూ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలపై అక్కడక్కడ ఎవరో ఫిర్యాదు చేశారని కేసులు నమోదు చేస్తున్నారని, పై అధికారుల ముందుస్తు అనుమతి లేనిదే కేసులు నమోదు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీ జితేందర్‌కు ట్రెసా నేతలు విజ్ఞప్తి చేశారు. ఆదివారం డీజీపీని ఆయన కార్యాలయంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్ కుమార్‌తో కూడిన ప్రతినిధి బృందం కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని అందించింది. వనపర్తి, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి, కరీంనగర్ వంటి జిల్లాలలో కొన్ని చోట్ల  ఎలాంటి ముందుస్తు అనుమతి లేకుండా, ఎలాంటి విచారణ లేకుండా మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న తహసీల్దార్లపై, ఆర్డీవోలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.

 

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 197 (CrPC) కింద, కొత్త చట్టం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 సెక్షన్ 218 (BNSS) కింద ఏదైనా మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న అధికారిపై విధి నిర్వహణలో భాగంగా తీసుకునే చర్యలపై కేసు నమోదు చేసి విచారణ చేయడానికి జిల్లా కలెక్టర్/ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. దీనిపై అన్ని జిల్లాల ఎస్పీలకు, పోలీస్ కమీషనర్లకు రాతపూర్వకంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. గతంలోనూ ఈ విషయంలో అనేకసార్లు వినతి పత్రాలు అందించిన విషయాన్ని డీజీపీకి ట్రెసా ప్రతినిధులు గుర్తు చేసారు.

 

ఇటీవల బాచుపల్లి తహసీల్దార్ పూల్ సింగ్ సర్వేకి సంబంధించిన విషయంలో లొకేషన్ స్కెచ్ పై అటెస్టెడ్ చేసారని క్రిమినల్ కేస్ నమోదు చేశారని, ఈ కేసులో ఆయన పేరు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్తో విచారణ చేయించి ఆయనకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డీజీపీ.. ట్రెసా విజ్ఞప్తిని పరిశీలించి, అన్ని జిల్లాల ఎస్పీలకు,పోలీస్ కమీషనర్లకు తగు ఆదేశాలిస్తామని హామీ ఇచ్చారని ట్రెసా నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ లతో పాటు కో ఆర్డినేటర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.