Telangana: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్? ఐదుగురి పేర్లతో జాబితా!

- శివధర్, రవి పేర్లను తొలగించిన డీవోపీటీ..
- లిస్టులో మిగిలిన సౌమ్యా మిశ్రా, శిఖాగోయల్
- రేసులో వెనుకబడిన శివధర్‌రెడ్డి?
- లగచర్ల, హెచ్‌సీయూ ఆందోళనలు
- శివధర్‌రెడ్డికి నెగెటివ్‌గా మారాయా?
- ఐపీఎస్ వర్గాల్లో ఆసక్తికర చర్చలు
హైదరాబాద్, ఏప్రిల్ 20 (విధాత): తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న సీవీ ఆనంద్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వాస్తవానికి ఇప్పటికే ఐదు పేర్లతో జాబితాను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. డీజీపీ పోస్టు కోసం ముగ్గురి పేర్లను ఎంపిక చేసి కేంద్రానికి పంపించాల్సి ఉండగా.. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఐదుగురి పేర్లను ప్రతిపాదించారు. ప్రస్తుత డీజీపీ జితేందర్ పదవీకాలం ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలాఖరుతో ముగియనున్నది. రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ తరువాత పోలీసు శాఖలో డీజీపీ పోస్టుకు ప్రాముఖ్యం, ప్రాధాన్యం ఉంది. గతేడాది జూలై నెలలో 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన జితేందర్ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం మరో ఐదు నెలల్లో ముగియనుండడంతో నూతన డీజీపీ ఎంపికకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలైంది. ఈ పదవిని దక్కించుకునేందుకు ఎవరికి వారుగా తమ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
ఐదు పేర్లతో కేంద్రానికి ప్రతిపాదన
ఐపీఎస్ సీనియార్టీ జాబితా ప్రకారం రవిగుప్తా (1990), సీవీ ఆనంద్ (1991), కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (1994), బీ శివధర్ రెడ్డి (1994), సౌమ్యా మిశ్రా (1994), శిఖా గోయల్ (1994) పోటీలో ఉన్నారని కొంతకాలంగా చర్చించుకుంటున్నారు. రవిగుప్తా రాష్ట్ర హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, ఆనంద్ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇక శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్నారు. సౌమ్యా మిశ్రా డీజీ (జైళ్లు), శిఖా గోయల్ సీఐడీ అడిషనల్ డీజీపీగా కొనసాగుతున్నారు. సెక్రటరీ రవిగుప్తా ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ఆ తరువాతి స్థానంలో సీవీ ఆనంద్ ఉన్నారు. ఆనంద్‌కు 2028 జూలై వరకు సర్వీసు ఉండటం కలిసి వచ్చే అవకాశంగా చెబుతున్నారు. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఈ ఏడాది పదవీ విరమణ చేస్తుండగా, శివధర్ రెడ్డి వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో, సౌమ్యా మిశ్రా 2027 డిసెంబర్ చివరన, శిఖా గోయల్ 2029 మార్చి నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు.
ఆనంద్‌కు రాష్ట్ర సర్వీసులతో పాటు కేంద్ర సర్వీసులో పనిచేసిన అనుభవం కూడా ఉన్నది. పైగా సౌమ్యుడనే ముద్ర ఉంది. ఏ ఒక్కరికీ అనుకూలంగా వ్యవహరించకుండా చట్టపరిధిలో వ్యవహరిస్తారనే పేరుండటం అదనపు అర్హతగా ఉన్నతాధికారులు చెబుతున్నారు. సాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ డీజీపీ పదవికి మూడు పేర్లను మాత్రమే సిఫారసు చేస్తుంది. కానీ ఈసారి ఐదుగురి పేర్లను యూపీఎస్సీకి సిఫారసు చేసినట్టు తెలిసింది. ముగ్గురు బదులు ఐదుగురి పేర్లను పంపించాలని సీనియర్ ఐపీఎస్‌లు చేసిన వినతిని ముఖ్యమంత్రి పరిగణనలోకి తీసుకున్నారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పేర్లను పరిశీలించిన యూపీఎస్సీ.. కేంద్ర హోం శాఖకు సిఫారసు చేస్తుంది.
అందులో ఒకరిని కేంద్ర హోం శాఖ ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తున్నది. పేరును ఖరారు చేసే ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని హోం శాఖ పరిగణనలోకి తీసుకుంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. జాబితా సిద్ధం చేసే నాటికి రిటైర్మెంట్‌కు కనీసం ఆరు నెలల సర్వీసు ఉండాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 2023 నవంబర్ నెలలో నిబంధన కొత్తగా తీసుకువచ్చింది. ఈ నిబంధనతో రవిగుప్తా, శ్రీనివాస్ రెడ్డి, శివధర్ రెడ్డి పేర్లను కేంద్ర ప్రభుత్వం పక్కకు పెట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపించారని విశ్వసనీయంగా తెలిసింది. దీంతో పోటీలో సీవీ ఆనంద్‌తోపాటు సౌమ్యా మిశ్రా, శిఖా గోయల్ పేర్లను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనున్నదని అంటున్నారు.
వికారాబాద్ జిల్లా లగచర్ల భూ సేకరణ విషయంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, కంచ గచ్చిబౌలి భూముల విషయంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థుల ఆందోళనలపై ఇంటెలిజెన్స్ ఏడీజీ శివధర్ రెడ్డి అప్రమత్తం చేయలేదనే ఆగ్రహంతో ముఖ్యమంత్రి ఉన్నారని ఐపీఎస్ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. లగచర్ల భూములను సేకరించవద్దని రైతులు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆ సమయంలో జిల్లా కలెక్టర్‌పై దాడికి ముందే సన్నాహాలు జరిగాయన్న వాదనలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ పై దాడి చేసేందుకు ప్రయత్నించడం, ఆయన వెళ్లిపోవడంతో భూ సేకరణ అధికారిపై దాడికి దిగడం, తీవ్రంగా గాయపర్చడం, జిల్లా కలెక్టర్ వాహనాన్ని పాక్షికంగా ధ్వంసం చేయడం జరిగింది.
విధ్వంసానికి దిగుతున్నారని తెలిసి కూడా ముందస్తుగా తనను మాటమాత్రంగానైనా అప్రమత్తం చేయలేదని ముఖ్యమంత్రి సన్నిహిత మంత్రుల వద్ద వ్యాఖ్యానించారని తెలుస్తున్నది. ఆ తరువాత కంచ గచ్చిబౌలిలో భూమి చదును పనులు యుద్ధ ప్రాతిపదికన చేసే సమయంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థులు, ప్రతిపక్షాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయని సమాచారం ఉన్నప్పటికీ తనకు చెప్పలేదని కూడా ముఖ్యమంత్రి ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. ఈ రెండు గొడవలు ముఖ్యమంత్రిని జాతీయ స్థాయిలో ఇరుకున బెట్టాయి. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు కూడా ఆగ్రహంగా ఉంది. ఈ కారణంగానే శివధర్‌రెడ్డిని పక్కనపెట్టి ఉంటారని సీనియర్ పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు.