extreme climate events । దేశంలోని 85 శాతం జిల్లాలపై ప్రకృతి కన్నెర్ర: తాజా అధ్యయనంలో వెల్లడి
వాతావరణంలో తీవ్ర మార్పులు వచ్చాయనేందుకు భారీ వర్షాల కారణంగా ఇటీవల కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు, గుజరాత్‌లో వరదలు, ఓం పర్వతంపై మంచు కరిగిపోవడం, అకస్మాత్తుగా నగరాల్లో కురిసే కుండపోత వర్షాలు నిదర్శనమని

extreme climate events । దేశంలోని 85 శాతానికిపైగా జిల్లాలు వరదలు, కరువు, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటున్నాయని తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది. ఈ అధ్యయనాన్ని ఐపీఈ గ్లోబల్, ఈశ్రీ ఇండియా సంయుక్తంగా నిర్వహించాయి. 45 శాతం జిల్లాలు ఒకప్పుడు తీవ్ర వరదలను ఎదుర్కొని ఇప్పుడు కరువు బారిన పడటమో.. లేదా తీవ్ర కరువు పరిస్థితుల నుంచి భారీ వరదల పరిస్థితిని ఎదుర్కొనడమో జరుగుతున్నదని తెలిపింది. పెంటా- డికేడల్ అనాలిసిస్ పద్ధతిని ఉపయోగించి ఈ అధ్యయాన్ని నిర్వహించారు. దీని ద్వారా 1973 నుంచి 2023 వరకూ యాభై సంవత్సరాల తీవ్ర వాతావరణ పరిస్థితులను క్రోడీకరించారు.
గడిచిన దశాబ్దంలోనే ప్రకృతి వైపరీత్యాల్లో ఐదింతల పెరుగుదల, భారీ వరదల్లో నాలుగింతల పెరుగుదల ఉన్నట్టు అధ్యయనంలో గుర్తించారు. తూర్పు భారతదేశంలోని జిల్లాలు తరచూ భారీ వరదలకు గురవుతున్నాయని నివేదిక పేర్కొన్నది. తర్వాతి స్థానాల్లో ఈశాన్య, దక్షిణ భారతదేశ జిల్లాలు ఉన్నాయి. కరువు పరిస్థితులు రెండింతలు పెరిగాయని అధ్యయనం తెలిపింది. ప్రత్యేకించి వ్యవసాయ సంబంధ, వాతావరణ సంబంధిత కరువులు పెరిగాయని పేర్కొన్నది. తుఫానుల వంటివి నాలుగింతలు పెరిగాయని తెలిపింది. బీహార్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో తీవ్ర ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్నాయని అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి పది మంది భారతీయుల్లో 9 మంది తీవ్ర ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్నారని ఐపీఈ గ్లోబల్‌లోని క్లయిమేట్ చేంజ్ అండ్ సస్టయినబిలిటీ ప్రాక్టీస్ అధిపతి, నివేదిక రచయిత అబినాష్ మొహంతి చెప్పారు. గత శతాబ్దంలో ఉష్ణోగ్రతలు 0.6 డిగ్రీల సెల్సియస్ పెరగడమే దీనికి కారణమని ఆయన వివరించారు.
వాతావరణంలో తీవ్ర మార్పులు వచ్చాయనేందుకు భారీ వర్షాల కారణంగా ఇటీవల కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు, గుజరాత్‌లో వరదలు, ఓం పర్వతంపై మంచు కరిగిపోవడం, అకస్మాత్తుగా నగరాల్లో కురిసే కుండపోత వర్షాలు నిదర్శనమని ఆయన అన్నారు. 2036 నాటికి 147 కోట్ల మంది భారతీయులు తీవ్ర వాతావరణ మార్పులకు ప్రభావితమవుతారని తమ విశ్లేషణ పేర్కొంటున్నదని మొహంతి తెలిపారు. 45 శాతం జిల్లాలు ప్రకృతి వైపరీత్యాల బదలాయింపులను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. తరచూ వరదలకు గురయ్యే ప్రాంతాల్లో కరువు తాండవిస్తున్నదని, కరువు ఛాయలు ఎదుర్కొన్నవి ఇప్పుడు భారీ వరదలను చవిచూస్తున్నాయని ఆయన తెలిపారు. ఇందులోనూ కరువు నుంచి వరద పరిస్థితులకు మారిన జిల్లాల కంటే.. వరదల నుంచి కరువు వైపు మళ్లి జిల్లాలే ఎక్కువగా ఉన్నాయని, ఇటువంటి పరిస్థితులు త్రిపుర, కేరళ, బీహార్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయని నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర, జిల్లా, నగర స్థాయిలో క్లయిమేట్ రిస్క్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయాలని అధ్యయనం సిఫారసు చేసింది. పర్యావరణానికి సంబంధించి స్థానికంగా తగిన చర్యలు తీసుకునేందుకు అనువుగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్లయిమేట్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది.