ఆదివారం నాడు జర్నలిస్టులకు నివాస స్థలాలు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి

జర్నలిస్టుల సుదీర్ఘకాల కల.. ఆదివారం నెరవేరబోతున్నది. అనేక ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కేటాయించిన భూమికి సంబంధించిన స్వాధీన పత్రాన్ని నేటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందించేందుకు శుభముహూర్తం ఖరారైంది.

ఆదివారం నాడు జర్నలిస్టులకు నివాస స్థలాలు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి
  • 38 ఎకరాల భూమి స్వాధీనం చేస్తూ పత్రాలు
  • మరణించిన 36 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ లక్ష అందచేత

హైదరాబాద్: జర్నలిస్టుల సుదీర్ఘకాల కల.. ఆదివారం నెరవేరబోతున్నది. అనేక ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కేటాయించిన భూమికి సంబంధించిన స్వాధీన పత్రాన్ని నేటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందించేందుకు శుభముహూర్తం ఖరారైంది. ఆదివారం (08.09.2024) హైదరాబాద్‌లోని రవీంద్రభరతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. జర్నలిస్టుల జవహర్‌లాల్‌ నెహ్రూ హౌసింగ్‌ సొసైటీకి 38 ఎకరాల భూమిని అందచేయనున్నారు. ప్రజాప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమం అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస రెడ్డితో పాటు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, స్థానిక పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. రాష్ట్రంలో విధినిర్వహణలో, వివిధ కారణాల వల్ల మరణించిన 36 మంది పాత్రికేయుల కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా ఈ సమావేశంలో అందించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా పాల్గొనే ఈ సమావేశానికి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా జర్నలిస్టులను సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ ఎం. హనుమంత రావు విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమాన్ని సమాచార శాఖ తరపున లైవ్ కవరేజి ఇస్తున్నందున ప్రెస్ ఫోటో, వీడియో గ్రాఫ్ చేయడానికి అనుమతించడంలేదని, ఇందుకు సహకరించాల్సిందిగా తెలిపారు.