ఉగ్రవాదుల ఏరివేత పేరుతో పాకిస్తాన్ జరిపిన బాంబు దాడుల్లో 30 మంది పాకిస్తాన్ సాధారణ ప్రజలు మరణించారు. ఖైబర్ పాఖ్‌తూన్‌ఖ్వా ఫ్రావిన్స్ లో గల మాట్రేదారా గ్రామంపై పాకిస్తాన్ బాంబుదాడికి దిగింది. సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగింది. మరణించినవారిలో పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారని సమాచారం. సంఘటన స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. ఖైబర్ పాఖత్ తూన్ ఖ్వా లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్మూలించేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది మరణించారు. ఈ ఏడాది జూన్ లో డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడులు పాకిస్తాన్ లో పౌరుల జీవనాన్ని దెబ్బతీసిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. ఖైబర్ పాఖ్‌తూన్‌ఖ్వాలో పౌరుల ప్రాణాలను, ఆస్తులను రక్షించడంలో పాకిస్తాన్ వైఫల్యం చెందిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపణలు చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు ఈ ప్రాంతంలో 605 ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో 138 మంది పౌరులు, 79 మంది పాకిస్తానీ పోలీస్ సిబ్బంది మరణించారు. ఆగస్టులో 129 ఘటనలు నమోదయ్యాయి. ఇందులో ఆరుగుర్తు పాకిస్తానీ ఆర్మీ, పారా మిలటరీ ఫెడరల్ సిబ్బంది చనిపోయారు. బలోచిస్తాన్ తర్వాత ఖైబర్ పాఖ్‌తూన్‌ఖ్వా ఫ్రావిన్స్ లోనే ఎక్కువగా ఉగ్రదాడులు జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.