ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi) ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఆదివారం హార్డ్ ల్యాండింగ్( మిలిటరీ భాషలో కూలిపోయిందని అర్థం)కు గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలియపరుస్తున్నాయి. ప్రతికూల వాతావరణం వల్ల ఈ సంఘటన జరిగిఉంటుందని స్థానిక మీడియా తెలిపింది. సంఘటన జరిగిన ప్రదేశాన్ని గుర్తించేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయని ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రెస్టీవీ పేర్కొంది. ఈ మేరకు వీడియోను రిలీజ్ చేసింది. ఇరాన్లోని తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్లో రైసీ పర్యటిస్తున్నారని, అక్కన్నుంచి ఆయన తెబ్రిజ్ నగరానికి బయలుదేరారని తెలిసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్కు వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో అజర్బైజాన్ దేశానికి సరిహద్దులో ఉన్న జోల్ఫా సమీపంలో ఈ సంఘటన జరిగిందని ఇరాన్ అధికారిక మీడియా సంస్థలు తెలిపాయి.
కాగా, ఇబ్రహీం రైసీ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ఇరాన్ సుప్రీం కమాండర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తెలిపారు. దేశ ప్రజలనుద్దేశించి ఆయన కోసం ప్రార్థించండి అని కోరినట్లు ప్రభుత్వ మీడియా ఐఆర్ఐబీ తెలిపింది.
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Nrendra Modi) ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. అధ్యక్షుడు రైసీ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు, ఈ విపత్కర పరిస్థితుల్తో తాము రైసీ కుటుంబసభ్యులకు, ఇరాన్ ప్రజలకు అండగా ఉంటామని, వారికి తమ సంఘీభావాన్ని తెలుపుతున్నట్లు ఎక్స్లో సందేశాన్ని పోస్ట్ చేసారు.
Tags: