ఉప్పును ఆహార‌ప‌దార్థాల‌పై జ‌ల్లుకుని మ‌రీ తింటున్నారా? ఒక సారి ఆలోచించాల్సిందే..

  • Publish Date - November 4, 2023 / 08:58 AM IST

ఆహార ప‌దార్థాలను వండేసిన త‌ర్వాత వాటి మీద ఉప్పు జ‌ల్లుకుని (Salt Sprinkling on Food) తినే అల‌వాటు ఉందా? అయితే మీకు డ‌యాబెటిస్ ముప్పు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. శ‌రీరానికి కావాల్సిన దాని కంటే ఎక్కువ మొత్తంలో ఉప్పు తింటే ర‌క్త‌పోటు ముప్పు త‌ప్ప‌ద‌ని ఇది వ‌ర‌కే తెలిసిన విష‌య‌మే.


అయితే తాజా ప‌రిశోధ‌న‌ (Study) లో మితిమిరీన ఉప్పు వినియోగం డ‌యాబెటిస్ (Type 2 Diabetes) ముప్పును కూడా తెచ్చిపెడుతుంద‌ని వెల్ల‌డైంది. మొత్తం నాలుగు ల‌క్ష‌ల‌ మంది యూకే పౌరుల‌పై ఈ అధ్య‌య‌నం చేయ‌గా దానికి సంబంధించిన ఫ‌లితాల‌ను మాయో క్లినిక్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు. దాని ప్ర‌కారం.. ఉప్పును ఎక్కువ‌గా వినియోగించేవారికి.. సాధార‌ణ ఆహార‌పు అల‌వాట్లు ఉన్న‌వారితో పోలిస్తే.. టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చే ప్ర‌మాదం 39 శాతం అధికంగా ఉంది.


ఈ అధ్య‌య‌నంలో భాగంగా 37 నుంచి 73 ఏళ్ల మ‌ధ్య ఉన్న వ‌య‌సున్న 4,02, 982 మంది డేటాను యూకే (UK) బ‌యోబాంక్ నుంచి సేక‌రించి ప‌రిశోధ‌కులు విశ్లేషించారు. వీరి 12 ఏళ్ల డేటాను విశ్లేషించిన అనంత‌రం ఆ నాలుగు ల‌క్ష‌ల మందిలో 13 వేల మంది టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ప‌డ్డార‌ని తేలింది. దీంతో ఆ 13 వేల మంది నుంచి వారి ఆహార అల‌వాట్ల గురించి వివ‌రాలు సేక‌రించ‌గా వారిలో ఎక్కువ మంది తాము వండిన ఆహార‌ప‌దార్థాల‌పై ఉప్పు జ‌ల్లుకుంటున్నామ‌ని పేర్కొన్నారు.


ఆహార ప‌దార్థంలో లేదా ఇత‌ర చిరుతిళ్ల‌లో వేసుకునే ఉప్పున‌కు ఇది అద‌నం కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆ దిశ‌గా ప‌రిశోధ‌న చేసిన వైద్యులు.. ఉప్పు వాడ‌టానికి డ‌యాబెటిస్‌కు సంబంధం ఉంద‌ని తేల్చారు. వండిన ప‌దార్థాల‌పై అప్పుడ‌ప్పుడూ ఉప్పు వేసుకునేవారికి 13 శాతం, ఏదైనా సంద‌ర్భాల్లో వేసుకునేవారికి 20 శాతం, రోజూ వేసుకునేవారికి 39 శాతం టైప్ 2 మ‌ధుమేహం వ‌చ్చే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంద‌ని తేల్చారు. ‘ఉప్పును త‌గ్గించ‌డం ద్వారా గుండె సంబంధిత స‌మ‌స్య‌ల నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని ఇప్ప‌టికే రుజువ‌యింది.


అయితే ఉప్పు వినియోగాన్ని త‌గ్గించ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ ముప్పు కూడా త‌గ్గుతుంద‌ని తొలిసారి ఈ అధ్య‌య‌నం వ‌ల్ల నిరూపిత‌మైంది’ అని అమెరికాలోని తులానే యూనివ‌ర్సిటీ స్కూల్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ అండ్ ట్రాపిక‌ల్ మెడిసిన్ ప్రొఫెస‌ర్ లు షి వెల్ల‌డించారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూచించిన రోజుకు 5 గ్రాముల ఉప్పు నియ‌మాన్ని పాటించడం మంచిద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే ఈ ప‌రిశోధ‌న ఫ‌లితాలు దేశం, ప్రాంతం, వ‌య‌సు, లింగం, ఎత్తు, బ‌రువు, ధూమ‌పానం, మ‌ద్య‌పానం వంటి అంశాల‌పైనా ఆధార‌ప‌డి ఉంటాయ‌ని పేర్కొన్నారు.

Latest News