Site icon vidhaatha

Sunita Williams | మరో ఆరు నెలలు స్పేస్‌స్టేషన్‌లోనే సునీతా విలియమ్స్‌, బారీ విల్మోర్‌.. క్లారిటీ ఇచ్చిన నాసా

Sunita Williams | భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్‌ విల్మోర్‌ ఇంటర్‌నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లోనే చిక్కుకుపోయారు. ఇద్దరు తిరిగి ఎప్పుడు భూమిపైకి చేరుతారనే విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయితే, ఈ విషయంపై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కీలక ప్రకటన చేసింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ వచ్చే ఏడాది అనగా ఫిబ్రవరి 2025లో భూమికి తిరిగి వస్తారని పేర్కొంది. బోయింగ్‌కు చెందిన స్టార్‌ లైనర్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ కేవలం పది రోజుల అంతరిక్ష యాత్ర కోసం ఈ ఏడాది జూన్‌ 5న ప్రయోగం చేపట్టిన విషయం తెలిసిందే. పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ప్రయోగం చివరకు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అయితే, అక్కడ పలు సమస్యలు ఎదురయ్యాయి.

థ్రస్టర్ పనితీరు దెబ్బతినడంతో హీలియం లీకేజీ అవుతున్నట్లు గుర్తించారు. దాంతో స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌ని తాత్కాలికంగా ఐఎస్ఎస్‌కు అనుసంధానించారు. ఐఎస్ఎస్ నుంచి ఇప్పుడు సనీతా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్‌కు అన్ని సౌకర్యాలు అందుతూ వస్తున్నాయి. ఇద్దరు వ్యోమగాములు అక్కడికి చేరుకొని ఇప్పటి వరకు 80 రోజులు దాటింది. అయితే, నాసా తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు వ్యోమగాములు ఇద్దరు 2025 ఫిబ్రవరిలోనే తిరిగి భూమిపైకి చేరుతారని పేర్కొంది. మరో ఆరునెలల పాటు ఇద్దరు అక్కడే ఉండాల్సి రానున్నది. ఆరోగ్యం, స్టార్‌ లైనర్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ పునరుద్ధరణ పనులపై పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ తరఫున క్రూ మిషన్‌ ద్వారా పలువురు వ్యోమగాములు సెప్టెంబర్‌ 24న అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.

వారంతా 2025 ఫిబ్రవరిలోనే తిరిగి భూమిపైకి చేరుకుంటారు. ఆ సమయంలోనే వారితో కలిసి సునీతా విలియమ్స్‌, విల్మోర్‌ సైతం తిరిగి భూమిపైకి చేరుకోనున్నారు. ఇదిలా ఉండగా.. స్టార్‌లైనర్ థ్రస్టర్ కోసం ఇంజినీర్లు కొత్త కంప్యూటర్ మోడల్‌ను విశ్లేషిస్తున్నారని ఇటీవల తెలిపింది. ఫైనల్‌ నిర్ణయం తీసుకునే సమయంలో ప్రతి ప్రమాదాన్ని విశ్లేషిస్తామని స్పష్టం చేసింది. అంతరిక్షంలో, భూమిపై థ్రస్టర్ విస్తృతమైన పరీక్షలో స్టార్‌లైనర్ వ్యోమగాములను సురక్షితంగా తిరిగి పంపగల సామర్థ్యాన్ని కలిగి ఉందని ఇటీవల బోయింగ్‌ పేర్కొంది. బోయింగ్‌కు ఇదే తొలి టెస్ట్ ఫ్లైట్. ‘స్పేస్ షటిల్’ సేవ నుంచి ఉపసంహరించుకున్న తర్వాత, నాసా అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను తరలించే పనిని బోయింగ్ , స్పేస్‌ఎక్స్‌లకు అప్పగించింది. స్పేస్‌ఎక్స్‌ 2020 నుంచి నాసాతో కలిసి పని చేస్తున్నది.

Exit mobile version