Trump Warned Zelensky To Accept Putin’s Peace Terms | Tense White House Meeting
(విధాత ఇంటర్నేషనల్ డెస్క్)
వాషింగ్టన్:
యూక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. శ్వేతసౌధంలో జరిగిన ఈ సమావేశంలో ట్రంప్ “పుతిన్ చెప్పినట్టే ఒప్పుకోండి, లేదంటే యూక్రెయిన్ నాశనమవుతుంది” అని జెలెన్‌స్కీని బెదిరించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్, రాయిటర్స్, ది గార్డియన్ వంటి అంతర్జాతీయ పత్రికలు వెల్లడించాయి.
ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిగిన ఫోన్‌కాల్ తరువాత జెలెన్‌స్కీతో భేటీ అయ్యాడు. ఆ సంభాషణలో పుతిన్ డోన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు సమాచారం. దీనిని ఆధారంగా చేసుకొని ట్రంప్ కూడా జెలెన్‌స్కీపై అదే ఒత్తిడి తెచ్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి. “యుద్ధం కొనసాగిస్తే మీ దేశం నిలబడదు. పుతిన్ చాలా శక్తివంతుడు” అని ట్రంప్ హెచ్చరించినట్లు హెల్సింకి టైమ్స్ పేర్కొంది.
సమావేశంలో ఇద్దరు నాయకులు స్వరాలు పెంచుకొని మాట్లాడుకున్నారని, ఒక దశలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుందని పత్రిక వెల్లడించింది. జెలెన్‌స్కీ బృందం యుద్ధభూమి మ్యాప్‌లు చూపిస్తూ పరిస్థితి వివరించగా, ట్రంప్ వాటిని పక్కన పెట్టి “ఇక మ్యాప్‌లు చాలు… పరిష్కారం కావాలి” అంటూ కోపంగా అరిచినట్లు తెలిపింది.
జెలెన్‌స్కీ నిరాకరణ – శాంతి ఒప్పందంపైనే ట్రంప్ దృష్టి
జెలెన్‌స్కీ ఈ భేటీకి అమెరికా నుంచి కొత్త ఆయుధాలు, రక్షణ సహాయం పొందడానికి వచ్చినప్పటికీ, ట్రంప్ మాత్రం యుద్ధాన్ని నిలిపివేయాలనే దిశలో ఆలోచిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. “ప్రస్తుత పరిస్థితి వద్దనే కాల్పులు నిలిపి శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలి” అని ట్రంప్ సూచించినట్లు రాయిటర్స్ తెలిపింది.
ఈ వ్యాఖ్యలు జెలెన్‌స్కీకి నిరాశ కలిగించాయని, సమావేశం ముగిసిన వెంటనే ఆయన యూరోపియన్ నేతలతో చర్చలు ప్రారంభించారని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. “యూక్రెయిన్ అభిప్రాయం లేకుండా ఏ ఒప్పందం జరగదు” అని జెలెన్‌స్కీ స్పష్టంచేశారని తెలిపింది.
అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, ట్రంప్ తాజా వైఖరి అమెరికా విదేశాంగ విధానంలో ఒక మార్పు. రష్యాపై కఠిన వైఖరి నుంచి ఇప్పుడు త్వరిత శాంతి ప్రయత్నాల వైపు ట్రంప్ దృష్టి మళ్లిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది.
అయితే యూక్రెయిన్ భూభాగాలను ఇచ్చే విధమైన ఒప్పందాలు భవిష్యత్తులో రష్యా మరింత విస్తరణకు దారితీయవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.