విధాత, హైదరాబాద్ : యునైటెడ్ కింగ్‌డమ్ ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్ (UK House of Lords)కు తాజాగా తెలంగాణ(Telangana)కు చెందిన ఎన్నారై ఉదయ్ నాగరాజు(Uday Nagaraju) నామినేట్ కావడం విశేషం. ఉదయ్ నాగరాజు స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామం. వరంగల్, హైదరాబాద్‌లలో చదువుకుని.. బ్రిటన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్‌లో పాలనా శాస్త్రంలో ఉదయ్ నాగరాజు పీజీ చదివారు. ప్రపంచ సమాజం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పభ్రావం ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్-ట్యాంక్ ని నెలకొల్పారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు. క్షేత్రస్థాయి సమస్యలపైన ఉదయ్ కు మంచి అవగాహాన ఉండటం విశేషం.
ప్రధానమంత్రి సలహా మేరకు హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు బ్రిటన్ రాజు లేదా రాణి చేతుల మీదుగా సభ్యుల నామినేషన్ జరుగుతుంది. రాజకీయ పార్టీలు, స్వతంత్ర సంస్థలు, ప్రజల నుంచి రాజుకు నామినేషన్స్ వస్తుంటాయి. హౌస్ ఆఫ్ లార్డ్స్ ప్రతినిధులు చట్టాల రూపకల్పన, ప్రభుత్వ పర్యవేక్షణలో భాగస్వామిగా కొనసాగుతారు. గతంలో బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో లేబర్ పార్టీ నుంచి ఉదయ్ నాగరాజు నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ నుంచి పోటీ చేశారు.
హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఉదయ్ నాగరాజు నామినేట్ కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. మీ జర్నీ అందరికీ స్ఫూర్తి అని కొనియాడారు.
