స‌ముద్రంలోకి జారిన అమెరికా నేవీ విమానం

అమెరికా నౌకాద‌ళానికి చెందిన భారీ విమానం ర‌న్‌వే నుంచి అదుపు త‌ప్పి హ‌వాయి స‌ముద్రంలోకి జారిపోయింది. స‌ముద్రంలో స‌గానికిపైగా మునిగిన‌ప్ప‌టికీ విమానంలో ఉన్న తొమ్మిది మంది సిబ్బంది సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు

  • Publish Date - November 21, 2023 / 06:38 AM IST

  • తొమ్మిది మంది విమాన సిబ్బంది సురక్షితం
  • మేఘాలు, వర్షం కారణంగా క‌నిపించ‌ని ర‌న్‌వే


విధాత‌: అమెరికా నౌకాద‌ళానికి చెందిన భారీ విమానం ర‌న్‌వే నుంచి అదుపు త‌ప్పి హ‌వాయి స‌ముద్రంలోకి జారిపోయింది. స‌ముద్రంలో స‌గానికిపైగా మునిగిన‌ప్ప‌టికీ విమానంలో ఉన్న తొమ్మిది మంది సిబ్బంది సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు.


పెట్రోల్ స్క్వాడ్రన్ ఫోర్ నుంచి బ‌య‌లుదేరిన అమెరికా నేవీ P-8A విమానం సోమవారం (స్థానిక కాలమానం ప్రకారం) మెరైన్ కార్ప్స్ బేస్ హవాయి వద్ద రన్‌వేపై దిగుతుండ‌గా అదుపుత‌ప్పి కనోహే ఒట్టున నీటిలో ప‌డిపోయింది.


విమాన‌ సిబ్బంది ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారని ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి షేన్ ఎన్‌రైట్ తెలిపారు. విమానాన్ని ల్యాండ్ చేసే సమయంలో మేఘాలు, వర్షం కారణంగా తక్కువగా విజిబిలిటీ ఉన్న‌ద‌ని వాతావరణ శాస్త్రవేత్త థామస్ వాఘన్ పేర్కొన్నారు.


విమాన ప్ర‌మాద స‌మయంలో అక్క‌డే స‌ముద్ర ఒడ్డున ప‌డ‌వ ప్ర‌యాణంలో ఉన్న ఓ కుటుంబం ఆ ఫొటోల‌ను తీసింది. నావికాదళ విమానం స‌గం తేలుతున్న దృశ్యం వెంటనే వారికి దృష్టిని ఆకర్షించింది. ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టుచేయ‌డంతో వైర‌ల్‌గా మారాయి.

Latest News