Zanclean mega flood | మధ్యధరా సముద్రం మనమంతా మ్యాప్స్‌లో చూసిందే. నిజానికి అది ఒకప్పుడు భూభాగమేనట. యాభై లక్షల సంవత్సరాల క్రితం.. ఈ ధరిత్రిపై చోటు చేసుకున్న ఏకైక అతిపెద్ద మహావరద కారణంగా అట్లాంటిక్ మహాసముద్రం ఉప్పొంగింది. ఇప్పుడు ఉన్న జిబ్రాల్టర్ జల సంధి భాగాన్ని చీల్చుకుని, అడ్డొచ్చిన ప్రతి భూభాగాన్నీ తనలో కలిపేసుకుంటూ సాగిన ఆ వరద బీభత్సం.. అంతిమంగా మధ్యధరా సముద్రంగా మారిందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఒకప్పుడు ఖాళీ భూభాగంగా ఉన్న ఆ ప్రాంతంలోకి అట్లాంటిక్ మహా సముద్రం ఉప్పొంగింది. సుమారు రెండు సంవత్సరాలపాటు అడ్డూ అదుపూ లేకుండా సాగిన నీటి ప్రవాహం ఇప్పుడు యూరప్, ఆఫ్రికా ఖండాల మధ్య మధ్యధరా సముద్రాన్ని ఏర్పాటు చేసిందని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పుడు అమెజాన్ నదిలో పారే నీటికి వెయ్యి రెట్ల నీరు ఆ మహా వరద సందర్భంగా అట్లాంటిక్ సముద్రం నుంచి ఉప్పొంగిందని వారు పేర్కొంటున్నారు.
జిబ్రాల్టర్ జల సంధి వద్ద సముద్రం అడుగు భాగాన ఉన్న లోయను గతంలో అధ్యయనం చేశారు. 2009లోనూ ఒక అధ్యయాన్ని వెలువరించారు. ఆ లోయ.. సదరు మహా వరద కారణంగానే ఏర్పడిందని ఆ అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఘటనను జాంక్లీన్ మెగాఫ్లడ్‌గా పేర్కొంటున్నారు. ధరిత్రిపై వచ్చిన ఏకైక అతిపెద్ద మహా వరదగా దీనిని భావిస్తున్నారు. అయితే.. కొందరు పరిశోధకులు మాత్రం ఈ అధ్యయనంతో విభేదిస్తున్నారు. అయితే.. తాజాగా జాంక్లీన్ శకం నాటి అవక్షేపణ శిలలను (మట్టిరాళ్ల వంటివి) అధ్యయనం చేశారు. ఆధునిక సిసిలీ, ఆఫ్రికా ప్రధాన భూభాగాల మధ్య గ్యాప్ ద్వారా మధ్యధరా సముద్ర తూర్పు అర్ధభాగాన్ని తిరిగి నింపడానికి నీరు ఎలా పెరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు.
50 నుంచి 60 లక్షల ఏళ్ల క్రితం ఒక అసాధారణ ఘటన చోటు చేసుకున్నదని 19వ శతాబ్దం చివరి సంవత్సరాల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సముద్రాలన్నీ ఎండిపోయిన ఈ కాలాన్ని మెస్సీనియన్ యుగంగా పరిగణిస్తారు. మధ్యధరా సముద్రం అడుగు భాగం కింద ఉన్న రాళ్లను తవ్వి చూడగా.. దాదాపు కిలోమీటరు మందంతో ఉప్పు పొర ఒకటి బయటపడింది. 60 లక్షల సంవత్సరాల క్రితం విస్తృతమైన పర్యావరణ మార్పు చోటుచేసుకున్నదని, టెక్టోనిక్ కార్యకలాపాలు అట్లాంటిక్ మహా సముద్రం నుంచి సముద్రాన్ని వేరు చేశాయని ఇది నిరూపించింది. నిస్సారమైన, తక్కువ ఉప్పు సాంద్రత కలిగిన సరస్సుల నుంచి శిలాజాలను కూడా పరిశోధకులు కనుగొన్నారు. దాని ఆధారంగా ఇక్కడి నీరు అవిరి అయిపోయి, సముద్రం ప్రస్తుత స్థాయి నుంచి ఒక కిలోమీటరు దిగువకు పడిపోయిందని గుర్తించారు. ఈ విపత్తులో మధ్యధరా సముద్ర జాతుల్లోని సుమారు 11 శాతం జీవజాలం మాత్రమే బయటపడగలిగింది.
2009లో పరిశోధించిన సైంటిస్టులు.. అట్లాంటిక్ మహాసముద్రానికి, మధ్యధరా సముద్రానికి మధ్య నీటిలో ఏర్పడిన కందకం.. ఆకస్మికంగా, వినాశకరంగా ఏర్పడిన వరద సృష్టించినదేనని తెలుసుకున్నారు. సిసిలీ సిల్ సమీపంలోని చిన్న కొండలను తమ బృందం అధ్యయనం చేయగా.. అసాధారణంగా కనిపించాయని తాజా అధ్యయనం సహ రచయిత గియోవన్నీ బర్రేకా తెలిపారు. అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఉన్న కొండల తరహాలో ఇవి కూడా ఒకచోట చేరి క్రమబద్ధీకరించినట్టు ఉన్నాయని చెప్పారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని కొండలు.. మంచుయుగం అంతరించిపోయే సమయంలో సంభవించిన మెగాఫ్లడ్ కారణంగా ఏర్పడ్డాయి. ఈ పోలిక ఆధారంగానే శాస్త్రవేత్తలు తమ పరిశోధనను ముందుకు తీసుకెళ్లారు. లోయల అడుగు భాగం నుంచి కోతకు గురైన రాతి శిథిలాలు కొండల పైభాగంతో సరిపోలుతాయని వారు భావించారు. వారి ఊహ నిజమని తేలింది. దీన్ని ధృవీకరించుకునేందుకు వారికి పెద్ద బండరాయి పరిమాణం వరకూ ఉన్న రాతిశిథిలాలు లభించాయి. 40 మీటర్లు లేదా అంతకు మించిన లోతుతో నీటి ప్రవాహం గంటకు 115 కిలోమీటర్ల వేగంతో దూసుకురావడం ద్వారా ఈ కొండలు ఇలా కోతకు గురయ్యాయని శాస్త్రవేత్తల బృందం తయారు చేసిన నమూనా పేర్కొంటున్నది.