70 Yr Old Man First Vlog | విజయానికి వయసు అడ్డుకాదు.. 70 ఏండ్ల వయసులో తొలి వ్లాగ్‌తో అదరగొట్టిన పెద్దాయన

70 ఏళ్ల వయసులో తొలి వ్లాగ్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ఉత్తర్ ప్రదేశ్ పెద్దాయన కథ అందరికీ స్ఫూర్తిగా మారింది.

వయసు కేవలం సంఖ్య మాత్రమే. దానికి శరీరంతోనే పని.. విజయానికి కాదు. చేయాలనే కసి, తపన ఉండాలే గానీ ఏ వయసులోనైనా.. అనుకున్న లక్ష్యాలను సాధించొచ్చు. ఇందుకు నిదర్శనమే ఈ పెద్దాయన. 70 ఏండ్ల వయసులోనూ అనుకున్నది సాధించి.. ఒక్కరోజులోనే జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఉత్తర్ ప్రదేశ్‌ (Uttar Pradesh)కు చెందిన వినోద్ కుమార్ శర్మ (Vinod Kumar Sharma)కు ప్రస్తుతం 70 ఏండ్లు. ఆయనకు సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్ అవ్వాలన్న కోరిక ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల తన కోరికను చంపుకుంటూ వచ్చాడు. అయినప్పటికీ తన ఆశ తీరలేదన్న బాధ ఆయనను వెంటాడేది. దీంతో 70 ఏండ్ల వయసులో తొలి వ్లాగ్‌ (First Vlog)తో సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి ‘ఇన్‌స్టా అంకుల్’ పేరిట ఓ ఛానల్ స్టార్ట్ చేశాడు. అందులో ‘డే 1 టు వన్ డే’ పేరిట ఓ వీడియోను రిలీజ్ చేశాడు.

వీడియోలో.. ముందుగా తనని తాను పరిచయం చేసుకున్నాడు. 70 ఏండ్ల వయసులో మొదటి వ్లాగ్‌ చేస్తున్నట్లు చెప్పాడు. ఈ రంగంలో తనకు ఎలాంటి ముందస్తు అనుభవం లేదని, కొత్తగా ప్రయత్నిస్తున్నట్లు వివరించాడు. తనకు వ్లాగ్‌ ఎలా చేయాలో కూడా తెలియదని.. వృద్ధాప్యంలో విలువైన సమయాన్ని అర్థవంతంగా గడపడానికే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆ పెద్దాయని తన తొలి వ్లాగ్‌ వీడియోలో చెప్పుకొచ్చాడు. వీడియో విడుదలైన క్షణాల్లోనే అది అతను ఊహించని విధంగా దూసుకుపోయింది. ఆ వీడియోకి విపరీతమైన ఆదరణ లభించింది. వీడియో పోస్టు చేసిన 72 గంటల్లోనే ఏకంగా 30 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. అంతేకాదు లక్షల్లో లైక్స్‌, వేలల్లో కామెంట్స్‌ వచ్చాయి.

ఈ వీడియో విజయం తర్వాత ’ఇన్‌స్టా అంకుల్’ ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 70 వేలకు పెరిగింది. ఈ వీడియో అనుపమ్‌ఖేర్‌, జే భానుశాలి వంటి ప్రముఖుల దృష్టిని కూడా ఆకర్షించిందంటే అర్థం చేసుకోవాలి. పలువురు నెటిజన్లు సైతం పెద్దాయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మొదటి ప్రయత్నం అద్భుతం తాతా.. మీ తర్వాతి వీడియో కోసం ఎదురు చూస్తున్నాం’, ‘మీరు నిజంగా గ్రేట్ తాతగారు. మిమ్మల్ని ఈతరం వాళ్లు స్ఫూర్తిగా తీసుకోవాలి’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉంటే దానికి వయసు అడ్డురాదని ఈ తాత నిరూపించాడు మరి..

ఇవి కూడా చదవండి :

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల హక్కులు మీకు తెలుసా?
Delhi Rains | ఢిల్లీలో వర్షం.. కశ్మీర్‌లో మంచు.. ఉత్తరాదిలో అకస్మాత్తుగా మారిన వాతావరణం

Latest News