ఉత్తరాదిలో (North India) వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో వర్షం పడగా (Rain In Delhi).. కశ్మీర్‌లో విపరీతంగా మంచు కురుస్తోంది (Snowfall In Kashmir). ఇలా వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
ఉరుములు, మెరుపులతో వర్షం..
ఇవాళ ఉదయం ఢిల్లీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన గాలులతో వాన పడింది. ఇవాళ మొత్తం మేఘాలు కమ్ముకుని ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం 4.50 నిమిషాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
నరేలా, బవానా, అలీపూర్, బురారీ, ఖాంజావాలా, రోహిణి, బద్లీ, మోడల్ టౌన్, ఆజాద్‌పూర్, పీతంపురా, ముండ్కా, పశ్చిమ్ విహార్, పంజాబీ బాగ్, రాజౌరి గార్డెన్, జాఫర్‌పుర్, నజఫ్‌ఘర్, ద్వారక తదితర ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో అతి శీతల గాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది. వర్షం వల్ల ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నాయి.
కశ్మీర్‌పై మంచు దుప్పటి..
భూతల స్వర్గం అందాల కశ్మీర్‌పై మంచు దుప్పటి (Snowfall) కప్పేసింది. వ్యాలీ (Kashmir Valley)లో విపరీతంగా మంచు పడుతోంది. ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి. ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. దాంతో కశ్మీర్ వ్యాలీ పరిసరాలన్నీ అందంగా, ఆహ్లాదకరంగా, అద్భుతంగా కనిపిస్తున్నాయి. కొండ ప్రాంతాలపై కురుస్తున్న మంచు పర్యాటకుల్ని ఆహ్వానిస్తోంది.
ప్రముఖ పర్యాటక ప్రాంతాలు సోనమార్గ్ (Sonamarg), గుల్మార్గ్, లఢక్, శ్రీనగర్ సహా ఉత్తర, దక్షిణ కశ్మీర్‌లో ఎత్తైన ప్రాంతాల్లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాలు శ్వేతవర్ణంతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇళ్లు, రహదారులు, చెట్లను మంచు కమ్మేసింది. నిరంతరాయంగా కురుస్తున్న మంచు వర్షాన్ని పర్యాటకులు ఆస్వాదిస్తుండగా.. స్థానికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శ్రీనగర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో అతివేగంగా శీతల గాలులు వీస్తున్నాయి. మధ్యధరా ప్రాంతం నుండి వచ్చే బలమైన అల్పపీడనం వల్ల వాతావరణ మార్పు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. విపరీతంగా మంచు కురుస్తుండటంతో శ్రీనగర్ విమానాశ్రయం పూర్తిగా మంచుతో నిండిపోయింది. దీంతో విమాన రాకపోకలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. జమ్ము కశ్మీర్‌తో పాటూ పొరుగు రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోనూ విపరీతంగా మంచు పడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
US warships around Iran| ఇరాన్ చుట్టు అమెరికా యుద్ధ నౌకలు..సర్వత్రా టెన్షన్
US Withdraws From WHO | ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగిన అమెరికా..కరోనా ఎఫెక్ట్
