ఎట్టకేలకు వికీలీక్స్‌ జూలియన్‌ అసాంజేకు జైలు నుంచి విముక్తి

వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే (52) ఎట్టకేలకు జైలు నుంచి బయటపడ్డారు. ఏళ్ల తరబడి అనేక దేశాల ప్రభుత్వాలతో వివాదాలు, చట్టపరమైన పోరాటాల అనంతరం లండన్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో జూన్‌ 24వ తేదీన జైలు నుంచి బయటకు వచ్చారు

  • Publish Date - June 25, 2024 / 07:37 PM IST

లండన్‌: వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే (52) ఎట్టకేలకు జైలు నుంచి బయటపడ్డారు. ఏళ్ల తరబడి అనేక దేశాల ప్రభుత్వాలతో వివాదాలు, చట్టపరమైన పోరాటాల అనంతరం లండన్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో జూన్‌ 24వ తేదీన జైలు నుంచి బయటకు వచ్చారు. అమెరికా ప్రభుత్వ రహస్య డాక్యుమెంట్లు సహా అనేక రహస్య పత్రాలను బహిరంగం చేయడం ద్వారా ఆయన సంచలనం రేపారు. ‘జూలియన్‌ అసాంజే స్వేచ్ఛా జీవి’ అని వికీలీక్స్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఒక విమానం కిటికీ నుంచి బయటకు చూస్తున్న అసాంజే ఫొటోను జత చేసింది. అసాంజే బయటపెట్టిన కొన్ని పత్రాల విషయంలో అమెరికా ప్రభుత్వంతో రాజీ కుదుర్చుకున్న నేపథ్యంలో ఆయన బ్రిటన్‌లోని బెల్మార్ష్‌ జైలు నుంచి బయటకు వచ్చి.. తన స్వదేశమైన ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. ఇక్కడ ఆయన ఐదేళ్లుగా జైలు జీవితం గడిపారు. ‘ప్రపంచవ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు, వివిధ సంస్థలు, పత్రికా స్వేచ్ఛ ప్రచారకులు, చట్టసభల సభ్యులు, నాయకులు ఐక్యరాజ్య సమితి వరకూ చేసిన కృషికారణంగా ఇది సాకారమైంది’ అని వికీలీక్స్‌ తన సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నది. ఈ కృషి కారణంగానే అమెరికా న్యాయశాఖతో సంప్రదింపులకు అవకాశం కలిగిందని తెలిపింది. అమెరికా న్యాయశాఖతో ఒక తుది ఒప్పందం కుదరాల్సి ఉన్నదని పేర్కొన్నది.

స్వాగతించిన ఆస్ట్రేలియా ప్రధాని

అసాంజే విడుదల కావడంపై ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనెస్‌ సంతోషం వ్యక్తం చేశారు. జూన్‌ 25వ తేదీన పార్లమెంటులో మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. సాధ్యమైనంత త్వరగా ఆసాంజేను ఆస్ట్రేలియాకు తీసుకురావాలని కోరుకున్నానని చెప్పారు. అసాంజే కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నా.. ఈ కేసు చాలా సుదీర్ఘకాలం సాగిందని అన్నారు. ఇంతకాలం సాగదీయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. అసాంజేకు కాన్సులర్‌ సహకారాన్ని ఆస్ట్రేలియా కొనసాగిస్తుందని తెలిపారు. అమెరికా న్యాయశాఖతో కుదిరినట్టు చెబుతున్న ఒప్పందం ప్రకారం.. జూన్‌ 26న అమెరికాలోని ఉత్తర మారినా ఐలాండ్స్‌లోని కోర్టులో అసాంజే హాజరుకావాల్సి ఉన్నది. కీలకమైన పత్రాలను బయటపెట్టిన కేసులో తన నేరాన్ని ఆయన అంగీకరిస్తారని తెలుస్తున్నది.

2006లో అసాంజే వికీలీక్స్‌ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఆఫ్ఘనిస్థాన్‌, ఇరాక్‌ యుద్ధాల సందర్భంగా అమెరికా మిలిటరీ రహస్య సమాచారాలను తన వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశారు. 2010లో స్విట్జర్లాండ్‌ అధికారులు ఆయనపై రేప్‌ అభియోగాలతో అరెస్టు వారెంటు జారీ చేశారు. ఆ ఆరోపణలను అసాంజే తిరస్కరించారు. తన అరెస్టును తప్పించుకునేందుకు 2012 నుంచి ఏడేళ్లపాటు లండన్‌లోని ఈక్వెడార్‌ ఎంబసీలో తలదాచుకున్నారు. ఈ ఆరోపణల్లో తనను అరెస్టు చేస్తే.. రహస్య పత్రాలు బయటపెట్టిన కేసులో తనను అమెరికాకు తరలిస్తారని భావించి, ఇక్కడ ఉన్నారు. అయితే.. తదుపరి ఆ కేసును స్వీడిష్‌ అధికారులు విడిచిపెట్టారు. 2019లో ఈక్వెడారియన్‌ ఎంబసీ ఆయనను బహిష్కరించింది. అప్పటి నుంచి బ్రిటన్‌లోని బెల్మార్ష్‌ జైల్లో ఆయన గడిపారు. ఆ మరుసటి సంవత్సరం కీలక పత్రాలను బహిరంగం చేయడంపై అమెరికా న్యాయశాఖ అసాంజేపై అభియోగాలు మోపింది.

Latest News