- మృతుల్లో తండ్రీ, ఇద్దరు పిల్లలు
- మరో మహిళలను కాపాడిన స్థానికులు
విధాత, వరంగల్: వరంగల్ (Warangal) జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ (Srsp Canal) లో శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు కారు పడిపోయింది. ఈ విషాద సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు (తండ్రి, కూతురు, కొడుకు) మృతి చెందారు.
ఈ ఘటన నుంచి ఒక మహిళను స్థానికులు తాడు సహాయంతో కాపాడారు. నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ కుటుంబంగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. మృతదేహాల కోసం గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..
వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలో ఎస్పారెస్పీ కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. వరంగల్ జిల్లా ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ కుటుంబంతో సహా కారులో ప్రయాణిస్తున్నారు.
సంగెం మండలం తీగరాజుపల్లి మార్గమధ్యలో డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్‌కు గుండె నొప్పి వచ్చింది. దీంతో చికిత్స కోసం తిరిగి వరంగల్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గుండె నొప్పి ఎక్కువై కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కాలువలో పడింది.
కారుతో పాటు తండ్రీ, కూతురు కాలువలో కొట్టుకపోయారు. కాలువలో కొట్టుకు పోతున్న తల్లిని స్థానికులు కాపాడారు. బాలుడు మృతి చెందాడు. ప్రస్తుతం గజఈతగాళ్లతో తండ్రీ, కూతురి కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు స్పాట్‌కు వెళ్లి సహాయక ప్రారంభించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
గల్లంతు అయిన తండ్రి, కూతురు మృతదేహాలు లభ్యం..
ఒకే కుటుంబానికి చెందిన మొత్తం ముగ్గురు మృతి. మృతులు సోమారపు ప్రవీణ్ కుమార్ (39), కూతురు చైత్ర సాయి (5), కుమారుడు సాయి వర్ధన్ (3). తల్లి విజయలక్ష్మిని తాడు సహాయంతో కాపాడిన స్థానిక రైతులు. వీరి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి.