అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి

ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థిని అనారోగ్యం కబలించింది. తన ఉద్యోగంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతి తల్లిదండ్రుల కలలు కల్లలు కావడంతో పాటు కడుపుకోతను మిగిల్చింది.

విధాత, హైదరాబాద్ :

ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థిని అనారోగ్యం కబలించింది. తన ఉద్యోగంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతి తల్లిదండ్రుల కలలు కల్లలు కావడంతో పాటు కడుపుకోతను మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్లకు చెందిన రాజ్యాలక్ష్మి (23) ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లింది. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ తన స్నేహితులతో అక్కేడే ఉంది. ఈ క్రమంలో ఆరోగ్యం బాగా లేకపోవడంతో మరణించింది.

బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన యార్లగడ్డ రామకృష్ణ, నాగమణి దంపతుల కుమార్తె అయిన రాజ్యలక్ష్మి విజయవాడలోని ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. 2023లో ఉన్నత చదువుల కోసం అమెరికాలోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్‌ (కంప్యూటర్స్‌) కోర్సులో చేరింది. ఇటీవల చదువు పూర్తయ్యాక, అక్కడే స్నేహితులతో కలిసి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం తనకు జలుబు, ఆయాసం ఉందని రాజ్యలక్ష్మి వైద్యుల అపాయింట్‌మెంట్‌ తీసుకుంది.

గురువారం రాత్రి స్నేహితులతో నిద్రపోయిన ఆమెను శనివారం ఉదయం స్నేహితులు లేపారు. కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, రాజ్యలక్ష్మి అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్దారించారు. తన కూతురి మరణ వార్త విన్న తల్లిదండ్రులు అచేతన స్థితిలోకి వెళ్లిపోయారు. యువతి మరణంతో కారంచెడు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా, అమెరికాలో విద్యార్థి రాజ్యలక్ష్మి మృతి పట్ల ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేసి, అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక, మృతదేహాన్ని అమెరికా నుంచి తరలించేందుకు ప్రభుత్వంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.