విధాత : సార్వత్రిక ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అనే విషయం ఇప్పుడు కొన్ని గంటల వ్యవధిలో తేలిపోతోంది. గతంలో అయితే ఎన్నికల ఫలితాలు తెలుసుకోవడానికి కనీసం 24 గంటలకు పైగా సమయం పట్టేది. ఎన్నికల ఫలితాలు త్వరగా తెలియడానికి ఒక రకంగా ఈవీఎంలు కారణం. అసలు ఈవీఎం అంటే ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి? ఈవీఎంలలో ఫలితాలను మార్చే అవకాశం ఉందా? ఈవీఎంలపై వచ్చే ఆరోపణలను ఈసీఐ కొట్టి పారేస్తోంది.
ఈవీఎం అంటే ఏంటి?
ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. ఓటర్లు వేసిన ఓటును ఎలక్ట్రానిక్ రూపంలో నమోదు చేస్తుంది. ఓటరు తాను ఏ పార్టీ లేదా ఏ అభ్యర్ధికి ఓటు వేశారో కచ్చితంగా, వేగంగా నమోదు చేస్తుంది.1982 నుంచి భారత ఎన్నికల సంఘం ఈసీఐ ఈవీఎంలను ఉపయోగిస్తుంది. ప్రారంభంలోని ఈవీఎంలకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఈవీఎంల మధ్య ఎన్నో తేడాలున్నాయి. మారుతున్న టెక్నాలజీని ఈవీఎంల తయారీలో ఉపయోగిస్తూ ఈవీఎంలను మరింత అభివృద్ది చేశారు. ఈవీఎంలను ట్యాంపర్ ప్రూఫ్ అని ఈసీఐ స్పష్టం చేసింది. ఒక్క ఈవీఎం జీవితకాలం 15 ఏళ్లు. ఈవీఎంలలో రెండు భాగాలుంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్, మరోటి బ్యాలెట్ యూనిట్. ఈ రెండింటికి కేబుల్ ద్వారా కనెక్షన్ ఉంటుంది. కంట్రోల్ యూనిట్ పోలింగ్ అధికారి లేదా ప్రిసైడింగ్ అధికారి మానిటర్ చేస్తారు. బ్యాలెట్ యూనిట్ బూత్ లోపల ఉంటుంది. బ్యాలెట్ పేపర్ ను జారీ చేయడానికి బదులుగా కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ బటన్ ను నొక్కడం ద్వారా పోలింగ్ అధికారి బ్యాలెట్ ను విడుదల చేస్తారు. అప్పుడు ఓటరు తాను చేయాలనుకున్న అభ్యర్థి ఎన్నికల గుర్తుకు ఎదురుగా ఉన్న బటన్ ను ప్రెస్ చేస్తే సరిపోతుంది. తాను ఎవరికి ఓటు వేశారో ఓటరుకు తెలిసిపోతుంది. కానీ, ప్రిసైడింగ్ అధికారికి తెలిసే అవకాశం ఉండదు.
ఈవీఎంలలో మెమరీ ఎంతకాలం ఉంటుంది?
ఈవీఎంలను తొలిసారిగా కేరళలోని పరపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపయోగించారు. ఈవీఎంలకు విద్యుత్ అవసరం లేదు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా అసెంబుల్ చేసిన సాధారణ బ్యాటరీతో పనిచేస్తాయి. ఒక్క ఈవీఎం గరిష్టంగా రెండు వేల ఓట్లను నమోదు చేస్తుంది. ఒక్క ఈవీఎంలో 384 మంది అభ్యర్థుల ఓట్లను నమోదు చేయవచ్చు. ఈవీఎంలలో నమోదైన ఓటింగ్ వివరాలను క్లియర్ చేసే వరకు అది మెమరీలో అలానే ఉంటుంది. బీఈఎల్ హైదరాబాద్, బెంగుళూరు సంస్థలు ఈవీఎంలను తయారు చేస్తున్నాయి. భారత ఎన్నికల సంఘం ఉపయోగిస్తున్న ఈవీఎంలు ఈ రెండు ప్రదేశాల్లో తయారైనవే. ఈవీఎం కంట్రోల్ యూనిట్ 7.4 నుంచి 8 వోల్టుల పవర్ ప్యాక్ ను కలిగి ఉంటుంది. పోలింగ్ జరుగుతున్న కొద్దీ బ్యాటరీ సామర్థ్యం తగ్గుతుంది. ఈవీఎంలు ఆల్కలీన్ బ్యాటరీలతో పనిచేస్తాయి. అందుకే వీటిని విద్యుత్ లేని ప్రాంతాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఈవీఎం బ్యాటరీ 5.8 వోల్టులకు తక్కువగా ఉంటే బ్యాటరీని మార్చాలని డిస్ ప్లే సూచిస్తుంది. ఈవీఎంలలో సింగిల్ యూజ్ బ్యాటరీలను ఉపయోగిస్తారు. మొబైల్స్ ఉపయోగించేలా బ్యాటరీలను చార్జింగ్ చేసే పద్దతి ఉండదు. బ్యాటరీ తగ్గిపోయినప్పుడు కొత్త బ్యాటరీని మార్చాల్సి ఉంటుంది.
వీవీప్యాట్ తో ఉపయోగం ఏంటి?
ఈవీఎంలకు వీవీప్యాట్ యంత్రం అనుసంధానించారు. ఓటరు తాను ఏ పార్టీకి లేదా ఏ అభ్యర్ధికి ఓటు వేశారో తెలుసుకునేందుకు వీవీప్యాట్ ఉపయోగపడుతుంది. వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటారు. ఈవీఎంలో ఓటరు ఓటు వేసిన తర్వాత అతను నమోదు చేసిన ఓటు ఏ అభ్యర్ధికి పడింది.. పార్టీ గుర్తు, అభ్యర్థి పేరు, క్రమ సంఖ్య వీవీప్యాట్ స్లిప్ పై కనిపిస్తుంది. ఒకవేళ ఓటరు తాను ఒక అభ్యర్థికి ఓటు వేస్తే మరో అభ్యర్థికి ఓటు వేసినట్టుగా చూపితే వెంటనే ఆ విషయాన్ని ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయాలి. అప్పుడు ప్రిసైడింగ్ అధికారి వీవీప్యాట్ మెషిన్ ను సరిచేస్తారు. అన్ని ఈవీఎంలకు వీవీప్యాట్ లను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఐదేళ్ల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. ఓటరకు 7 సెకన్ల పాటు స్క్రీన్ పై కనిపించే వీవీప్యాట్ ఆ తర్వాత సీల్డ్ బాక్స్ లో పడిపోతుంది. వీవీప్యాట్ లోని స్లిప్స్ ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిపోవాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 శాతం ఓట్లను ఇలా అధికారులు సరిచూస్తారు. 2015 నుంచి అన్ని ఎన్నికల్లో వీవీప్యాట్లను ఉపయోగిస్తున్నారు.
ఈసీఐఎల్ తయారు చేసిన సాఫ్ట్ వేర్
ఈవీఎంలలో ఉపయోగించిన సాఫ్ట్ వేర్ ఈసీఐఎల్ ఇంజనీర్లు తయారు చేశారు. ఈ బృందానికి తప్ప మరెవరికీ దీని గురించి తెలియదు. ఈవీఎం మెషిన్ ను ఉపయోగించుకొని ఎవరైనా తమకు నచ్చిన అభ్యర్థికి ఓట్లు వేసేలా చేస్తే…ఈవీఎం పనిచేయకుండా కూడా చేయవచ్చు. ఈవీఎం మెషీన్ పై ఉన్న బటన్ ను నొక్కితే చాలు ఈవీఎం పనిచేయదు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనే ప్రచారం కూడా ఉంది. దీనిపై గతంలో కొన్ని రాజకీయపార్టీలు ఆరోపణలు చేశాయి. ఈవీఎంలకు ఓ చిన్న పరికరం అమర్చి మొబైల్ ద్వారా ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఓట్లను తారుమారు చేయవచ్చని గతంలో మిచిగాన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కానీ, భారత ఎన్నికల సంఘం అధికారులు ఈ వాదనను కొట్టిపారేశారు. భారత్ లో ఉపయోగిస్తున్న ఈవీఎంలకు ఎలాంటి యాంటెన్నా, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు లేవని ఈసీఐ తెలిపింది. దేశంలో ఉపయోగిస్తున్న ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం సాధ్యం కాదని ఈసీ తేల్చి చెప్పింది.
చెల్లని ఓట్లకు చెక్..
ఈవీఎంలతో చెల్లని ఓట్లకు చెక్ పడింది. బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ జరిగితే చెల్లని ఓట్లు ఎక్కువగా ఉండేవి. ఈవీఎంలతో పోలింగ్ నిర్వహిస్తుండడంతో చెల్లని ఓట్లు అనేవి ఉండవు. అంతేకాదు బ్యాలెట్ల ముద్రణ, సరఫరా , వాటిని సురక్షితంగా భద్రపరచడం సులభమైన విషయం కాదు. ఈవీఎంల ద్వారా ఈ ఖర్చు తగ్గింది. రెండు నుంచి నాలుగు గంటల వ్యవధిలో ఫలితం తేలుతుంది.
