Jubilee Hills By-Election | జూబ్లీహిల్స్ పోలింగ్ కు సర్వం సిద్దం..తొలిసారి డ్రోన్లతో నిఘా

జూబ్లీహిల్స్ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి. తొలిసారిగా డ్రోన్లతో నిఘా. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు ఓటింగ్ జరగనుంది.

Jubilee Hills By-Election

విధాత, హైదరాబాద్ : రేపు మంగళవారం జరగబోయే జూబ్లీహిల్స్ పోలింగ్ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం డిస్టిబ్యూషన్ సెంటర్ నుంచి ఈవీఎం మిషన్స్ సహా పోలింగ్ సామాగ్రీని తీసుకుని పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ తర్వాతా ఈవీఎంలను తిరిగి ఇదే స్టేడియంకు చేర్చి భద్రపరుస్తాు. రేపు ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ ప్రక్రియను తొలిసారిగా డ్రోన్ ల నిఘాతో పర్యవేక్షించబోతున్నారు. అందులో భాగంగా డీఆర్సీ సెంటర్ వద్ద డ్రోన్ డెమో షో నిర్వహించారు. మొత్తం 139 డ్రోన్లతో నిఘా పెట్టనున్నారు. డ్రోన్ డెమో షోను జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ దగ్గరుండి పర్యవేక్షించారు. జూబ్లీహిల్స్ లో మొత్తం 4 లక్షల 1,365 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 3 వేల మంది పోలింగ్ సిబ్బంది, 2 వేల మంది పోలీసులు…మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విధుల్లో 5 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 230 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన 27 మందిపై కేసులు నమోదయ్యాయి. అక్రమ నగదు రూ. 3,60, 50, 952 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

పోలింగ్ ఏర్పాట్లు పూర్తి : చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లుగా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 4 ఈవీఎంలను ఏర్పాటు చేశామని, 226 సమస్యత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామని, 68 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద కేంద్ర బలగాలతో భద్రత కల్పించామని, ఐదు మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 45 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం ల ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల కోసం 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. 1950 నంబర్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి పర్యవేక్షించనున్నామని, మొదటిసారి డ్రోన్ లను వినియోగిస్తున్నాం అని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుందని..సమయం దాటినా..అప్పటికే క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు.