యూపీలో మొత్తం సీట్లు మేమే గెలిచినా ఈవీఎంలను విశ్వసించం: లోక్‌సభలో ఎస్పీ నేత అఖిలేశ్‌ యాదవ్‌

ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 సీట్లను తామే గెలిచినా కూడా తాము ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను విశ్వసించబోమని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, కన్నౌజ్‌ ఎంపీ అఖిలేశ్‌ యాదవ్‌ చెప్పారు.

  • Publish Date - July 2, 2024 / 04:23 PM IST

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 సీట్లను తామే గెలిచినా కూడా తాము ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను విశ్వసించబోమని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, కన్నౌజ్‌ ఎంపీ అఖిలేశ్‌ యాదవ్‌ చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం ఆయన లోక్‌సభలో చర్చలో పాల్గొన్నారు. ‘ఈవీఎంలపై మాకు నిన్న నమ్మకం లేదు.. ఈ రోజు లేదు.. మేం యూపీలోని మొత్తం 80 లోక్‌సభ సీట్లను గెలిచినా కూడా వాటిని నమ్మేది లేదు’ అని అఖిలేశ్‌ స్పష్టం చేశారు. ఈవీఎంలపై వివాదం సమసిపోలేదని అన్నారు.
అయోధ్య ఫలితాన్ని ప్రస్తావించిన అఖిలేశ్‌.. ‘అయోధ్యలో విజయం భారతదేశపు పరిపక్వత చెందిన ఓటరు సాధించిన ప్రజాస్వామిక విజయం’ అని అభివర్ణించారు. అయోధ్య ఉన్న ఫైజాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఎస్పీ తరఫున అవధేశ్‌ ప్రసాద్‌ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇక్కడ రామాలయాన్ని నిర్మించి, అంగరంగా వైభవంగా దాని ప్రారంభోత్సవం జరిపినా.. బీజేపీ ఇక్కడ విజయం సాధించలేక పోయింది.
కన్నౌజ్‌ నుంచి తొలిసారి గెలిచిన అఖిలేశ్‌.. దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాల్సిన అవశ్యకతను నొక్కి చెప్పారు. అగ్నిపథ్‌ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పథకాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రైతుల ఉద్యాన పంటలకు కనీస మద్దతు ధరకు చట్టపరమైన గ్యారెంటీ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Latest News