విధాత, హైదరాబాద్ : శాసన మండలి(Telangana Legislative Council) లో కాళేశ్వరం నివేదికను(Kaleshwaram Report)..సీబీఐ విచారణ( CBI investigation) జరిపించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(BRS MLCs)లు నినాదాలు, నిరసనలకు దిగడంతో సభలో గందరగోళం చెలరేగింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక అంతా రాజకీయ కుట్ర పూరితమంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆరోపిస్తూ చైర్మన్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. నివేదిక ప్రతులను చించివేసి చైర్మన్ పోడియం మీదకు విసిరేశారు. ‘రాహుల్‌కు సీబీఐ వద్దు.. రేవంత్‌కు సీబీఐ ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. సభ్యుల నిరసనల మధ్యనే మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, దామోదర రాజనరసింహలు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లు, పంచాయతీ రాజ్, మున్సిపల్ బిల్లులు, అల్లోపతిక్ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల చట్టం రద్దు బిల్లులను ఆమోదించారు. అనంతం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లుగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. సభ వాయిదా వేయడంతో కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గన్ పార్కు వద్ధ నిరసనకు దిగారు.
మండలిలో బీఆర్ఎస్ సభ్యుల వైఖరి కడుపులో కత్తులు పెట్టుకున్న మాదిరిగా ఉంది మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధంగా లేని బీఆర్ఎస్ సభ్యుల మానసిక విధానం చూస్తే జాలేస్తుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సిన వాళ్లే ఇలా ధర్నాలు చేయడం తగదన్నారు.