Site icon vidhaatha

Inflation calculator । ఇప్పుడు కోటి రూపాయల విలువ 20, 30 ఏళ్ల తర్వాత? ఇలా లెక్కకట్టుకోవచ్చు!

Inflation calculator । డబ్బును ఈ రోజు కాపాడుకుంటే.. రేపు అదే డబ్బు మిమ్మల్ని కాపాడుతుంది.. అనేది ఫైనాన్షియల్‌ మార్కెట్‌లో (financial market) తరచూ వినిపించే హితోక్తి! సింపుల్‌గా చెప్పాలంటే నేటి పొదుపే (savings) రేపటి భవిత! డబ్బుకు అంతటి శక్తి ఉంది. నిజానికి డబ్బుదేముంది.. ఉన్నదాంట్లో బతికితే చాలనే అభిప్రాయాలు ఉంటాయి. నిజమే.. కానీ.. ఉన్నదాంట్లో బతకాలన్నా కూడా డబ్బుండాలిగా? ఎందుకంటే.. ప్రభుత్వ విధానాలైతేనేమి.. మార్కెట్‌ మాయాజాలమైతేనేమి.. రూపాయి విలువ గత దశాబ్దాల కాలంగా చూస్తే పతనమవుతూనే (decline in value of the rupee) వస్తున్నది. ద్రవ్యోల్బణం నానాటికీ పెరుగుతూనే ఉన్నది. కేవలం ద్రవ్యోల్బణం (inflation) పెరుగుదల శాతాన్ని మాత్రమే చూపించి.. తగ్గింది, పెరిగింది.. అనే లెక్కలు చెబుతుంటారుగానీ.. వాస్తవానికి ద్రవ్యోల్బణం అనేది ఎప్పటికీ పెరుగుతూనే ఉన్న ఫ్యాక్టర్‌గా కనిపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో మరో పది లేదా 20 ఏళ్లలో ఉద్యోగాల నుంచి బయటకు వచ్చేవారు తమ రిటైర్మెంట్‌ అనంతర జీవితాన్ని (post-retirement needs) పకడ్బందీగా ప్లాన్‌ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఎందుకంటే.. ఈ రోజు రూపాయి విలువ ఇలా ఉండదు.. ఇవాళ కోటి రూపాయలు ఉన్నా.. 20, 30 ఏళ్లకు అదే కోటి రూపాయలకు పెద్దగా విలువ లేకపోవచ్చు. నిజానికి ఈ రోజు కోటి రూపాయల బెనిఫిట్లతో రిటైర్‌ అయ్యేవారికి అది పెద్ద మొత్తమే. తమ జీవితాన్ని సాఫీగా సాగించుకునేందుకు తగినంత మొత్తమే. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సొంత ఇల్లు వంటివి సమకూర్చుకోవడంలో ఈ మొత్తం తగిన విధంగా సహకరిస్తుంది. కానీ.. పది, 20, 30 ఏళ్ల తర్వాత ఇదే కోటి రూపాయలు (financial requirements) సరిపోతాయా? 10, 20, 30 ఏళ్ల తర్వాత కోటి రూపాయల విలువ ఎంత ఉన్నదో సులభంగానే అంచనా వేయొచ్చని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. దీనికి ఒక సూత్రాన్ని కూడా సూచిస్తున్నారు. దాని ప్రకారం అంచనా వేసుకుంటే.. భవిష్యత్తు దృశ్యం కనిపిస్తుందని చెబుతున్నారు.

నిజానికి ద్రవ్యోల్బణం అనేది రూపాయి విలువను తగ్గిస్తూ పోతుంటుంది. ఇది పొదుపు చర్యలకు కూడా విఘాతం కలిగిస్తుంటుంది. ఉదాహరణకు ఇప్పుడు పది లక్షలకు దొరికే కారు.. పదిహేనేళ్ల తర్వాత ధర పెరుగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. పది లేదా పదిహేనేళ్ల క్రితం మీరు కిరాణా సరుకులకు (groceries) ఎంత ఖర్చు చేసేవారు? ఇప్పుడెంత ఖర్చు చేస్తున్నారు? గతంలో అద్దె ఎంత చెల్లించేవారు? ఇప్పుడు ఎంత? గతంలో లీటర్‌ పెట్రోల్‌ ఎంత? ఇప్పుడెంత? మీ ఊరికి బస్‌ లేదా రైల్‌ టికెట్ ఎంత? ఇప్పుడెంత? పెరిగాయి కదా? ఇదే ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం కారణంగా డబ్బు విలువ తరిగి పోయింది. ధరలు పెరిగాయి. కనుక.. ఇప్పుడు కోటి రూపాయలు ఉన్నా.. పదేళ్ల తర్వాత ఈ కోటి రూపాయలు వేటికీ సరిపోవని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ద్రవ్యోల్బణాన్ని కాలిక్యులేట్‌ చేయడం ఎలా?

ఉదాహరణకు ద్రవ్యోల్బణం రేటు ఆరు శాతం అనుకుంటే.. కోటి రూపాయల విలువ.. 55.84 లక్షలకు పడిపోతుంది. దీర్ఘకాల పొదుపు, ఇన్వెస్ట్‌మెంట్లను ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. 20 ఏళ్ల తర్వాత పరిస్థితిని అంచనావేస్తే.. ఇప్పుడు కోటి రూపాయలు.. ఆరు శాతం ద్రవ్యోల్బణంతో 31.18 లక్షలకు పడిపోతాయి. ఇక 30 ఏళ్ల తర్వాత పరిస్థితిని లెక్కగడితే.. కోటి రూపాయలు కాస్తా.. 17.41 లక్షలకు చేరుతాయి.
దీని సారాంశం ఏమిటంటే.. మధ్యంతర, దీర్ఘకాలిక టర్మ్‌లో రిటైర్మెంట్‌కు ప్లాన్‌ చేసుకునేవారు.. చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రణాళికలు (long-term financial planning) రూపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజు పరిస్థితిని బట్టి కాకుండా.. పదేళ్లు, ఇరవై ఏళ్లు ముందు చూపుతో వ్యవహరించాలని చెబుతున్నారు. ఆరు శాతం రిటర్న్స్‌ ఉండే ఇన్వెస్ట్‌మెంట్లు కూడా పదేళ్లలో ఎటూ సరిపోవని, పెరిగే ఆరుశాతం ద్రవ్యోల్బణం.. మీ రిటర్న్స్‌ను మింగేస్తాయని అంటున్నారు. సో.. ఫైనాన్షియల్‌ మార్కెట్లో పెట్టుబడులు గుడ్డిగా, కాకుండా.. దూరదృష్టితో, పక్కా ప్రణాళికతో, సరైన సలహాలు సూచనలతో పెట్టాలని చెబుతున్నారు.

Exit mobile version