Site icon vidhaatha

Jayam Ravi । భార్య ఆర్తితో విడాకులపై జయం రవి ప్రకటన.. పోస్టులో ఏమున్నదంటే..

Jayam Ravi । పొన్నియన్‌ సెల్వన్‌ (Ponniyin Selvan) చిత్రంతో ప్రఖ్యాతి పొందిన తమిళ నటుడు జయం రవి (Jayam Ravi) తన భార్య ఆర్తి (Aarti) నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. దాదాపు 15 ఏళ్ల వివాహబంధాన్ని వారిద్దరూ ముగించారు. ఈ మేరకు సోమవారం జయం రవి తన ఎక్స్‌ ఖాతాలో ఒక పోస్టు పెట్టాడు. వ్యక్తిగత కారణాలతోనే (personal reasons) విడిపోతున్నట్టు తెలిపాడు. తమిళంలో ఒకటి, ఇంగ్లిష్‌లో మరొక నోట్‌ను ఉంచాడు. ‘జీవితం ఒక ప్రయాణం వంటిది. ఇందులో వేర్వేరు అధ్యాయాలు (chapters) ఉంటాయి. ప్రతి ఒక్క అధ్యాయానికి దానివైన అవకాశాలు, సవాళ్లు ఉంటాయి. మీలో అనేక మంది తెరపైన, వెలుపల నన్ను అభిమానించారు. ఎంతో ప్రేమను చూపుతూ మద్దతుగా నిలిచారు. నా ఫ్యాన్స్‌తో, మీడియాతో సాధ్యమైనంత వరకూ ఎల్లప్పుడూ పారదర్శకంగా (transparent), నిజాయితీగా ఉండటానికే ప్రయత్నించాను. నాకు చెందిన అత్యంత వ్యక్తిగతమైన విషయాన్ని మీతో పంచుకోవడం చాలా బాధగా ఉన్నది’ అంటూ తన పోస్టులో జయం రవి పేర్కొన్నాడు.

తన విడాకుల విషయంలో హడావుడిగా నిర్ణయం తీసుకోలేదని నోట్‌లో తెలిపాడు. ‘చాలా ఆలోచించి, ఎన్నో చర్చల అనంరతం ఒక కష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నాను. ఆర్తితో నా వివాహ బంధాన్ని ముగిస్తున్నాను. ఈ నిర్ణయం తొందరపాటుతో తీసుకున్నది కాదు. అందరికీ మంచి జరుతుందనే ఉద్దేశంతో వ్యక్తిగత కారణాలతో తీసుకున్నాను’ అని పేర్కొన్నాడు. ఈ సమయంలో తన, తన కుటుంబీలకు ఆంతరంగిక గోప్యతకు (privacy) భంగం కలిగించవద్దని ఫ్యాన్స్‌ను కోరాడు. తన వివాహంపై ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని విజ్ఞప్తి చేశాడు. ఈ విషయాన్ని తమ వ్యక్తిగత అంశంగా చూడాలని కోరాడు. ఇలానే మీకు ఆనందాన్ని సంతోషాన్ని  నా సినిమాల ద్వారా నా ప్రియమైన ప్రేక్షకులకు కలిగించడమే ఎల్లప్పుడూ నా ప్రాధాన్యంగా ఉంటుంది’ అంటూ ఆ నోట్‌ను జయం రవి ముగించాడు.

గత జూన్‌ నెలలో వివాహ వార్షికోత్సవం అనంతరం ఆర్తి తన ఇన్‌స్టా (Instagram) ఖాతా నుంచి రవి ఫొటోలను తొలగించినప్పుడే వారి విడాకులపై ఊహాగానాలు వెలువడ్డాయి. అలనాటి ప్రముఖ సినీ ఎడిటర్‌ ఏ మోహన్‌ కుమారుడైన రవి.. జయం, దాస్‌, మళాయి, బొమ్మరిల్లు, పెరన్మాయి, రోమియో జూలియట్‌, భూమి, సైరన్‌ వంటి చిత్రాలతో ప్రజాదరణ పొందాడు. ఆర్తి.. టెలివిజన్‌ ప్రొడ్యూసర్‌ సుజాత విజయ్‌కుమార్‌ కుమార్తె. జయరాం, ఆర్తిలకు  ఇద్దరు కుమారులు అరవ్‌, అయాన్‌ ఉన్నారు.

Exit mobile version