విధాత, హైదరాబాద్ : పీజేఆర్ కుమారుడు(PJR Son), మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy) తెలంగాణ జాగృతి, (Telangana Jagruthi)అధ్యక్షురాలు, బీఆర్ఎస్ బహిష్కృత నేత కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha)తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరుపున విష్ణును పోటీకి దించే యోచనలో కవిత ఉన్నట్లు సమాచారం. అరగంటకు పైగా ఈ విషయయై ఇద్దరి మధ్య మంతనాలు సాగాయి. ప్రస్తుతం విష్ణు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు.
ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై నిర్వహించిన సమావేశానికి విష్ణు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ ఎవరిని నిలబెట్టిన తనవంతు సహకారం అందిస్తానని చెప్పినట్లుగా సమాచారం. అయితే విష్ణు కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విష్ణు జూబ్లీహిల్స్ నుంచి జాగృతి తరుపున పోటీ చేసేందుకు సిద్దపడితే..ఉప ఎన్నికలో ఈ పరిణామం బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారవచ్చని రాజకీయ వర్గాలు విళ్లేషిస్తున్నాయి.
ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. మూడు పార్టీలు కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తుండగా..తాజాగా తెలంగాణ జాగృతి అభ్యర్థి కూడా రంగంలోకి దిగితే ఉప ఎన్నిక మరింత రసవత్తరంగా మారనుంది.