విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినే, మాజీ సీఎం కేసీఆర్(KCR) వరుసగా రెండో రోజు కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్(Erravalli Farmhouse)లో పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు కొనసాగిస్తున్నారు. కేసీఆర్ తో చర్చల నిమిత్తం కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలు నిన్నటి నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. నిన్న 10 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిన సమావేశం శుక్రవారం కూడా కొనసాగింది. ప్రధానంగా ప్రభుత్వానికి విద్యుత్తు ఒప్పందాలు..థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణ అవకతవకలకు సంబంధించిన కమిషన్ నివేదిక(Power Scam), కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Report) నివేదికలు అందిన నేపథ్యంలో నివేదికలలోని అంశాలు తమకు ప్రతికూలంగా ఉంటే ఏం చేయాలన్న దానిపై వారు చర్చించినట్లుగా తెలుస్తుంది. ఆయా నివేదికలను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం తమపై చర్యలకు ఉపక్రమిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలని వ్యూహప్రతివ్యూహాలపై వారు కసరత్తు చేసినట్లుగా సమాచారం. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాజకీయంగా అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా వారు చర్చించారని సమాచారం.
అలాగే ఈ నెలలో కరీంనగర్ లో నిర్వహించే బీసీ బహిరంగ సభ, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు వ్యవహారం, స్థానిక సంస్థల ఎన్నికలు..కవిత కార్యక్రమాలు వంటి అంశాలపై కూడా వారు చర్చించినట్లుగా తెలుస్తుంది.
