విధాత, హైదారాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కేబినెట్ లోని మంత్రుల మధ్య విబేధాలు(Ministers Dispute)..ఫిర్యాదులు వరుసగా వెలుగుచూస్తున్నాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ వివాదం..ఆ తర్వాత కొండా సురేఖ, సీతక్క వర్సెస్ పొంగులేటి మధ్య వివాదం హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా మంత్రి వివేక్ వెంకట స్వామి(Minister Vivek Venkataswamy) కూడా.. నన్ను ఎవరో టార్గెట్ చేసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను నాపైకి రెచ్చగొట్టి విమర్శలు చేయిస్తున్నారంటూ మరో బాంబు పేల్చారు. అసలు లక్ష్మణ్ నన్ను ఎందుకు విమర్శిస్తున్నారో అర్ధం కావడం లేదని మంత్రి వివేక్ వెంకట స్వామి వాపోయారు.
ఆదివారం నిజామాబాద్‌లో మాలల ఐక్య సదస్సులో వివేక్ మాట్లాడారు. సోషల్ మీడియా లో తనను కొంతమంది టార్గెట్ చేశారని మంత్రి వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేస్తున్న నాపై కుట్ర చేస్తున్నారన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నన్ను ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదు అన్నారు. లక్ష్మణ్ ను రాజకీయాల్లో ప్రోత్సహించింది మా నాన్న వెంకటస్వామియే అని చెప్పుకొచ్చారు. తాను మాల జాతి అని లక్ష్మణ్ విమర్శలు చేస్తున్నారని అన్నారు. తనకు మంత్రి పదవిపై మోజు లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ సమావేశానికి లక్ష్మణ్ వచ్చినప్పుడు తాను వెళ్లిపోతున్నానని అనటం అబద్ధమని పేర్కొన్నారు. తనమీద లక్ష్మణ్ కు ఎందుకు ఇంత ఈర్ష అని.. తాను అందరితో కలిసి కట్టుగా ఉంటానని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే తనకు మంచిపేరు వస్తుందని కొంతమంది విమర్శలు చేసున్నారని చెప్పుకొచ్చారు.