Site icon vidhaatha

Damodara Rajanarsimha । భూమి సమస్యల పరిష్కారాలకు గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు : మంత్రి దామోదర రాజనర్సింహ

Damodara Rajanarsimha ।  విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ అంటే  భూ పోరాటాల చరిత్ర అని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలోని భూమి సమస్యల పరిష్కారానికి గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సు నిర్వహించి భూ సమస్యల పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపాలని, అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాలని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న విద్యాలయాల్లో, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో  బుధవారం విద్య, ఆరోగ్య, పంచాయతీ, మున్సిపల్, వ్యవసాయ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, విద్యుత్, అభయ హస్తం, ఆర్టీసీ  శాఖలపై మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జబ్బు పడ్డ ప్రతివారికి ఉచిత నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అక్షయపాత్ర అదనపు వంటగదిని మెదక్‌లో ఏర్పాటు చేసుకోవడానికి అధికారులు దృష్టి సారించాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. మెదక్ ప్రభుత్వ దవఖానలో 30 రోజుల్లో సీటీస్కాన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ట్రామా, డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు.  నూతనంగా ఏర్పాటు చేసిన మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పాలన్నారు.

పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి

జిల్లాలో ఉన్న పారిశ్రామికవేత్తలు విద్యను ప్రోత్సహించడానికి నిధులు కేటాయించాలని మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని, రోగుల సమాచారం రికార్డ్ చేయాలని, ధరలు సూచిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో నూతన మెడికల్ కళాశాలకు అభ్యర్థించామని.. అది పరిశీలనలో ఉందని తెలిపారు. వ్యవసాయం లాభసాటి చేయాలని మంత్రి అధికారులకు చెప్పారు. జిల్లాలో అర్హత గల రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుందని హామీ ఇచ్చారు. నిరంతరం విద్యుత్ సరఫరా జరగాలన్నారు. పెండింగ్ లో ఉన్న రోడ్లు, భవనాలను పూర్తిచేయాలన్నారు. మెదక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ మెదక్ ప్రభుత్వ హాస్పిటల్ ను పరిశుభ్రంగా ఉంచాలని, దోమలు లేకుండా చూడాలని, నిరంతరం వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, రోగులను ప్రవేట్ హాస్పిటల్ పంపించే ప్రయత్నాలు చేయవద్దన్నారు. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్య సౌకర్యాలు కల్పించాలని, పాఠశాలల విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం, ఏకరూప దుస్తులు, పుస్తకాలు అందించి విద్యార్థులకు విద్యను ప్రోత్సహించాలన్నారు. నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నిరంతరం విద్యుత్ కొనసాగాలని, పెండింగ్ భవనాలు రోడ్లు పూర్తి చేయాలన్నారు. రుణమాఫీపై స్పష్టమైన విధానాన్ని రైతులకు వివరించాలన్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో భూ సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కార దిశగా ప్రయత్నం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ సమీక్ష సమావేశం సందర్భంగా మంత్రి, శాసనసభ్యులు, అధికారులు ఇచ్చిన సూచనలు తప్పకుండా పాటిస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో ధరణి పెండింగ్ కేసుల పరిష్కారం దిశగా రోజువారి కార్యక్రమాలు  నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version