Site icon vidhaatha

Pulivendula ZPTC| పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిలలో టీడీపీ సంచలన విజయం

అమరావతి : ఏపీలోని పులివెందుల(Pulivendula ZPTC ), ఒంటిమిట్ట జడ్పీటీసీ(Ontimitta ZPTC) స్థానాల ఉప ఎన్నికల(Bypoll)లో టీడీపీ(TDP) సంచలన విజయం(Victory) సాధించింది. వైసీసీ(YCP) కంచుకోట..స్వయంగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని ఈ రెండు జడ్పీటీసీ స్థానాలలో టీడీపీ విజయం సాధించడం విశేషం. 30ఏళ్ల తర్వాతా పులివెందుల స్థానంలో టీడీపీ గెలీచింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి(Latha Reddy) 6033 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. ఆమెకు 6,716 ఓట్లు పోలవ్వగా..ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి(Hemanth Reddy)కి 683ఓట్లు పోలయ్యాయి. లతారెడ్డి పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి సతీమణి. జగన్ అడ్డా పులివెందులలో వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకపోవడం చర్చనీయాంశమైంది.

ఇక ఇదే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మరో జడ్పీటీసీ స్థానం ఒంటిమిట్టలో సైతం టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి(Muddu Krishna Reddy)..సమీప వైసీపీ ప్రత్యర్థి ఇరుగంరెడ్డి సుబ్బారెడ్డి(Irugam Reddy Subba Reddy)పై 6267ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. కృష్ణారెడ్డికి 12,780ఓట్లు, సుబ్బారెడ్డికి 6,513ఓట్లు నమోదయ్యాయి.

 

పులివెందుల జడ్పీటీసీ , ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు తెలుగు రాష్ట్రాలలో ఉత్కంఠతగా మారాయి. కడప నగర శివార్లలోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల కౌంటింగ్‌కు 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై 1,000 ఓట్లు లెక్కించేలా ఏర్పాట్లు చేయగా..పులివెందుల జడ్పీటీసీ స్థానం ఫలితం ఒకేరౌండ్‌లో నే తెలిపోయింది. ఒంటిమిట్ట కౌంటింగ్ రెండు రౌండ్ల పూర్తికానుంది. ఈ రెండు స్థానాల్లో గెలుపుపై కూటమి నేతలు ధీమాగా ఉన్నారు. పులివెందులలో 8,101 ఓట్లు పోలవ్వగా, ఒంటిమిట్టలో 20,671ఓట్లు పోలయ్యాయి.

పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 11 మంది అభ్యర్థిలో బరిలోకి దిగారు.. ఒంటిమిట్టలో11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పులివెందుల నుంచి జడ్పీటీసీగా గెలిచిన మహేశ్వర్‌రెడ్డి మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అలాగే ఒంటిమిట్ట నుంచి జడ్పీటీసీగా ఉన్న ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసి రాజంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఆయన ఒంటిమిట్ట జడ్పీటీసీ, కడప జిల్లా జడ్పీ చైర్మన్‌ పదవులకు గతేడాది జూన్‌ 7న రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.

వైఎస్ జగన్ కుటుంబం సొంతగడ్డ పులివెందులలో మూడు దశాబ్దాల్లో ఒకసారి మాత్రమే ఇక్కడి జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. 1995, 2006, 2013, 2021లో ఎన్నిక ఏకగ్రీవమైంది. చివరిగా 2001లో మాత్రమే ఎన్నిక జరిగింది. ప్రస్తుతం జరిగిన ఎన్నికలతో అక్కడ ఏకగ్రీవాలకు తెరపడింది. మరోవైపు పులివెందుల, ఒంటిమిట్టలలో పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ అభ్యర్ధులు హేమంత్ రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలు ఈ ఎన్నికల్లో అక్రమాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

Exit mobile version