విధాత, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదిక(Kaleshwaram Report)ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) సభలో కాళేశ్వరం నివేదికను ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. కాళేశ్వరం నివేదికపై చర్చ సందర్భంగా సభలో ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల నుంచి ఏమైనా అవాంఛనీయ నిరసనలు ఎదురయ్యే పరిస్థితి తలెత్తవచ్చన్న అనుమానాల నేపధ్యంలో అసెంబ్లీ లోపల, బయట భారీ సంఖ్యలో మార్షల్స్ ను మోహరించారు. మొత్తంగా సభా ప్రాంగణంలో ఉత్కంఠ..ఉద్రిక్త గంభీర వాతావరణం నెలకొంది. కాళేశ్వరం నివేదికను సభలో ప్రవేశపెట్టిన క్రమంలో బీఆర్ఎస్ సభలో ఎలాంటి వ్యూహాం అనుసరించబోతుందన్నదానిపై ఆసక్తి నెలకొంది. అటు ప్రభుత్వం కూడా కాళేశ్వరం నివేదికపై చర్చ అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందన్నదానిపై కూడా ఉత్కంఠ ఏర్పడింది.
కాళేశ్వరం నివేదికను సభలో ప్రవేశ పెట్టే క్రమంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ..650పేజీలతో కూడిన కాళేశ్వరం నివేదికలోని అంశాలతో నోట్ ను తయారు చేసుకున్నానని తెలిపారు. ఆ నోట్ తోనే తాను సభలో ప్రసంగం ప్రారంభిస్తానని..నోట్ లోని అంశాలను సభకు వివరిస్తానని వెల్లడించారు. కమిషన్ నివేదికపై సభలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాట్లాడుతారన్నారు. కాళేశ్వరం పూర్తి నివేదిక కాపీని ఇంతకుముందే కేసీఆర్ తరుపునా హారీష్ రావు కు అందించామని ..బీఆర్ఎస్ పక్షానికి నివేదిక ప్రతి ఇవ్వలేదనడం అవాస్తవమని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ రోజు ఎంత రాత్రైనా కాళేశ్వరం నివేదికపై చర్చ పూర్తి చేస్తామన్నారు. చర్చ తర్వాతే ప్రభుత్వం తీసుకునే చర్యలపై ప్రకటన చేస్తుందని ఉత్తమ్ పేర్కొన్నారు.