విధాత, హైదరాబాద్ : తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల(Telangana Panchayat Elections) నిర్వహణలో భాగంగా గురువారం నామినేషన్ల స్వీకరణ(First Phase Nominations) ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. 30న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 4,236 పంచాయతీల సర్పంచ్ పదవులకు, 37,440 వార్డులకు డిసెంబర్ 11న పోలింగ్ జరగనుంది. అదేరోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.
ప్రచారానికి అభ్యర్దులకు ఎన్నికల సంఘం వారం రోజుల సమయం మాత్రమే ఇవ్వడంతో అభ్యర్ధులు నామినేషన్లు వేసి ఎన్నికల ప్రచారంలో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఓటర్లును కలిసి ఓట్లను అభ్యర్థించడంతో పాటు గెలుపు ఎత్తుగడలలో బిజీగా మారిపోతున్నారు.
