విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు(Telangana phone tapping case)లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు(Prabhakar Rao) పోలీసులకు లొంగిపోయారు(surrender). సుప్రీంకోర్టు ఆదేశాలు నేపధ్యంలో శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సిట్ పోలీసులకు లొంగిపోయారు. ప్రభాకర్ రావును వారం రోజుల కస్టడీ విచారణకు సుప్రీంకోర్టు అనుమతించింది. దీంతో పోలీసులు ఆయనను కస్టోడియల్ విచారణ చేయనున్నారు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఎస్ఐబీ మాజీ చీఫ్ గా ప్రభాకర్ రావు సారధ్యంలో డీఎస్పీ ప్రణీత్ రావు, డీసీపీ రాధాకిషన్ రావు, ఏసీపీలు భుజంగరావు, తిరుపతయ్యల బృందం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడింది. ఎంపిక చేసుకున్న ప్రతిపక్ష రాజకీయ నాయకులు, జడ్జీలు, జర్నలిస్టులు, సెలబ్రెటీలు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నగల వ్యాపారుల ఫోన్లను ట్యాపింగ్ చేశారు. నిందితుల్లో శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు మినహా మిగతా వారిని అరెస్టు చేసి విచారించారు. దాదాపు 4వేల ఫోన్లకు పైగా వారు ట్యాపింగ్ చేసినట్లుగా సిట్ విచారణలో గుర్తించింది.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన వెంటనే..నిందితులు ట్యాపింగ్ చేసిన డెటాను ధ్వంసం చేశారు. దీంతో సిట్ కు 300నుంచి 400కు పైగా ఫోన్ల సమాచారం మాత్రం లభ్యమైంది. ఈ లభించిన ఆధారాల మేరకు బాధితుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. రాధాకిషన్ తన కన్‌ఫెషన్‌లో మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావన తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కేసీఆర్‌కు పదేళ్లపాటు ఓఎస్డీగా పని చేసిన పీ రాజశేఖర్ రెడ్డిని ఇటీవలే సిట్ ప్రశ్నించింది.
ఇకపోతే..ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే ప్రభాకర్ రావు సహా నిందితుడు శ్రవణ్ రావుతో కలిసి అమెరికా పారిపోయారు. చివరకు పోలీసుల ఒత్తిడి ఫలించి సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణతో ప్రభాకర్ రావు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. అయితే సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీ మేరకు ఆయన విచారణకు సహకరించడం లేదని మధ్యంతర బెయిల్ రద్దు చేసి కస్టడీకి అనుమతించాలని సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రభాకర్ రావును లొంగిపోవాలని ఆదేశిస్తూ..వారం రోజుల కస్టడీకి అనుమతించింది. కేసు తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు సిట్ ముందు లొంగిపోయారు. ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణతో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశముందని విచారణాధికారులు భావిస్తున్నారు.
