- నేటి నుంచి సందర్శనార్ధం
- జూ అభివృద్ధికి రూ.4.2 కోట్లుః మంత్రి సురేఖ
విధాత, వరంగల్ ప్రతినిధిః హనుమకొండ హంటర్ రోడ్డులోని జూలో సందర్శకులకు శుక్రవారం నుంచి తెల్లపులి అందుబాటులోకి వచ్చింది. ఎంతో కాలంగా జూలో పులి కోసం ఎదురుచూస్తున్న వారి చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. చరణ్ అనే మగ తెల్లపులిని జూ ఎన్ క్లోజర్ లో నేటి నుంచి సందర్శకుల కోసం తెచ్చిపెట్టారు. చరణ్ అని పేరు పెట్టి పిలువగానే పులి స్పందించడంతో సందర్శకుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇది బెంగాల్ టైగర్ ల్యూక్నిక్ పిగ్మెంటేసన్ వేరియంట్. మధ్యప్రదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా రాష్టాల్లో ఈ జాతి వ్యాప్తి చెంది ఉంది. ఉష్ట మండల దట్టమైన అడవులు, మడ అడవులు, గడ్డి మైదానాల్లో, తీర ప్రాంత అడవుల్లో జీవిస్తోంది. ఇది జింకలు, లేళ్ళు తదితర వాటిని ఆహారంగా తీసుకుంటాయి. ఇది 4,5 సంవత్సరాల వయస్సులో సాధారణంగా నవంబర్, ఏప్రిల్ నెలలో ఎదకువస్తాయి. 10 నుంచి 15 సంవత్సాలు ఈ జాతి పులి జీవిస్తుంది. ఇదిలా ఉండగా కొద్ది నెలల క్రితం హైదరాబాద్ జూ నుంచి రెండు పులులు తీసుకొచ్చినప్పటికీ వయస్సు, అనారోగ్యం రీత్యా తిరిగి పంపించారు. తాజాగా తెల్లపులి రాకతో సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
జూ అభివృద్ధికి రూ.4.2 కోట్లుః సురేఖ
హనుకొండలోని జూలో తెల్లపులి సందర్శన కార్యక్రమాన్ని అనగా ఎన్‌క్లోజర్ లోకి రాష్ట్ర అటవీ పర్యావరణ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖ లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పులికి స్పందించేగుణం ఉంటుందనీ, మంచీ, చెడును పసిగడుతోందని తన పేరు పెట్టి పిలిస్తే తనదైన పద్ధతిలో రియాక్ట్ అవుతోందని వివరించారు. జూ అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.4.2 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. జూలో వసతులు మెరుగుపరుస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా ఈ మగ పులికి తోడుగా త్వరలో మరో ఆడపులిని తీసుకొచ్చే ప్రయత్నం సాగుతోంది. సింహంతో పాటు మరికొన్ని జంతువులు, ప్రత్యేక రకాలకు చెందిన పక్షులను తీసుకొచ్చి జూ సందర్శకుల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టనున్నారు. జూలోని జంతువులను జంతు ప్రేమికులు దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలన్నారు. జూ పార్కును అభివృద్ధి చేసేందుకు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూ,అటవీ శాఖాధికారులు పాల్గొన్నారు.