Kokapet
విధాత: కోకాపేట భూములు దేశంలోనే రికార్డు స్థాయి ధర పలికాయి – కోకాపేటలో అత్యధికంగా ఎకరం వందకోట్లు దాటి ఆల్ టైం రికార్డు సృష్టించింది. హైదరాబాద్ చరిత్రలోనే ఎకరం వంద కోట్లు పలకడం ఇదే మొదటిసారి అంటున్నారు. కోకాపేట నియో పాలిస్ రెండో విడత భూముల వేలం తెలంగాణ సర్కార్‌కు కాసుల పంట పండిస్తోంది. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కోకాపేట్ భూముల వేలం గురువారం జరిగింది. 6, 7, 8, 9 ప్లాట్లకు సంబంధించి జరిగిన వేలంలో 45.33 ఎకరాల్లోని ఏడు ప్లాట్లను హెచ్‌ఎండీ వేలం వేసింది.
ప్లాటు కనీస విస్తీర్ణం 3.9 ఎకరాల నుంచి 9.1 ఎకరాలుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ నిర్వహించిన ఈ వేలంలో ఆన్‌లైన్‌లో కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. ఒక ఎకరానికి అప్సెట్ ధర రూ.35 కోట్లుగా అధికారులు నిర్ణయించారు. ప్లాట్ నెం.9లో 3.6 ఎకరాల భూమి ఎకరం 76.5 కోట్లతో సాయంత్రానికి రికార్డు ధర పలికింది. వెనువెంటనే 10వ నంబర్ ప్లాట్ వంద కోట్ల ధర పలికింది.
భవిష్యత్తులో పదవ నంబర్ ప్లాటుకు ఔటర్ రింగ్ రోడ్డుతో కనెక్టివిటీ రానుండటంతో భారీ డిమాండ్ ఏర్పడింది. గతంలో కోల్‍కతాలో ఎకరం రూ.72.3 కోట్లు పలికి దేశంలోని సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పుడు వంద కోట్ల రూపాయలతో కోకాపేట భూములు కోల్‌కతా రికార్డును బ్రేక్ చేసింది.
ఈ ప్లాటు దక్కించుకునే విషయంలో ఏపీఆర్ – రాజ్‌పుష్ప కంపెనీల మధ్య హోరాహోరీ బిడ్డింగ్ కొనసాగింది. 10వ నెంబర్ ప్లాట్‌లో 3.60 ఎకరాల భూమి ఉంది. 11వ నెంబర్ ప్లాట్‌లో 7.53 ఎకరాలు, 14వ నెంబర్ ప్లాట్‌లో 7.34 ఎకరాలు ఉంది. ఈ మూడింటికి వేలం రాత్రి పది గంటల వరకు కొనసాగింది. ఈ భూముల వేలంలో దిగ్గజ స్థిరాస్తి సంస్థలు పోటీ పడ్డాయి. అయితే 7 ఫ్లాట్లకు 45.33 ఎకరాలకు 3319.60 కోట్ల ఆదాయం సమకూరింది.
మొదటి విడుత వేలంలో కోకాపేట భూముల్ని అక్వా స్పేస్.. రాజపుష్ప.. ఎంఎస్ఎన్ ఫార్మా.. ప్రిస్టేజ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్.. వర్సిటీ ఎడ్యుకేషనల్ మెనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థలు దక్కించుకున్నాయి. మొదటి విడతలో ఎకరా 30 కోట్ల నుంచి 60 కోట్ల వరకు ధర పలికింది. మొదటి విడుతలో ఆక్వాస్పేస్ పేరుతో వేలంలో బిడ్ వేసి విజయం సాధించిన సంస్థ.. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మైహోం రామేశ్వరరావుదని, రాజపుష్ప సంస్థ సీనియర్ ఐఏఎస్ అధికారికి చెందినదని.. ఎంఎస్ఎన్ ఫార్మా మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి తమ్ముడు సత్యనారాయణ రెడ్డిది అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
వర్సిటీ ఎడ్యుకేషనల్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ పేరుతో వేలంలో కోకాపేట భూమిని సొంతం చేసుకున్న సంస్థ శ్రీచైతన్య కళాశాలలకు చెందిన వారిదని అంటున్నారు. రెండో విడుత వేలంలో భాగంగా గురువారం వేసిన వేలం మాత్రం రికార్డు సృష్టించింది. ప్లాట్ నంబర్ 6,7.8,9,10 ల వేలం హోరాహోరీగా సాగింది.
ప్లాట్ నంబర్ 9 ఎకరం 76.5 కోట్లు ధర పలికింది. ప్లాట్ నంబర్ 6 వేలం 70.75 కోట్లు, ప్లాట్ నంబర్ 7 వేలం ఎకరం 75 కోట్లు, ప్లాట్ నంబర్ 8 వేలంలో ఎకరం 63.25 కోట్లు పలికింది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జరిగిన వేలంలో 10వ నంబర్ ప్లాటు ఎకరం వందకోట్లు దాటింది.
గతంలో కోకాపేటలో 49 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రెండువేల కోట్ల ఆదాయం వచ్చింది. అప్పుడు కనిష్టంగా ఎకరా రూ.31 కోట్ల నుంచి అత్యధికంగా రూ.60 కోట్ల రూపాయల ధర పలికింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువే పలికి ఏకంగా ఎకరం ధర వంద కోట్ల వరకూ వేలంలో దూసుకెళ్లడంతో తెలంగాణ ప్రభుత్వం భారీ ఆదాయాన్నిఆర్జింజనుంది.
ఈ వేలంలోనే రెండువేల నుండి రూ.2500 కోట్ల ఆదాయం సమకూరుతుందని హెచ్ఎండిఏ ఆశిస్తోంది. కోకాపెట నియో పోలిస్ భూములల్లో మల్టీపర్పస్ నిర్మాణాలు చేసుకోవడానికి అవకాశం ఉండడంతో భారీగా డిమాండ్ పెరిగింది. బడా సంస్థలు ఈ భూములను దక్కించుకోవడానికి పోటీ పడుతున్నాయి.
ఈ భూముల్లో భారీ నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వనుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎయిర్పోర్ట్‌కు, సిటీకి అత్యంత దగ్గరలో ఉన్న భారీ లేఅవుట్ కోకాపేట నియో పోలిస్ లేఅవుట్.. దీంతో డిమాండ్ భారీగా పెరిగింది.
కోకాపేట భూములు కో… అంటే కోట్లు కురిపిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి నిధులు సమకూర్చుకోవడానికి హైదరాబాద్‌లో భూముల అమ్మకానికి తెరలేపారు. అప్పుడు కూడా వేలం పాటలో ఎకరం 13 కోట్ల వరకు పలికి కోకాపేట భూములు రికార్డు సృష్టించాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి కూడా కోకాపేట భూములే కోట్లు కుమ్మరిస్తున్నాయి.
ఎకరం భూమికి కనీస ధర రూ. 35 కోట్లుగా హెచ్ఎండీఏ నిర్ణయించింది. వేలంలో మాత్రం అత్యధికంగా ఎకరం భూమి ధర వందకోట్ల మార్కును దాటింది. ఈ భూముల వేలంలో దిగ్గజ స్థిరాస్తి సంస్థలు పోటీ పడ్డాయి. ఇప్పటి వరకు కోకాపేట నియో పోలిస్‌లో 26.86 ఎకరాలకు వేలం పూర్తయింది.
కోకాపేట నియోపోలిస్ పేరుతో హెచ్ ఎండిఏ 500 ఎకరాల్లో లే అవుట్ సిద్ధం చేసింది. ఇందులో రూ.450 కోట్లతో రహదారులతోపాటు తాగునీరు, మురుగునీటి వ్యవస్థ, భారీ కేబుళ్ల కోసం ప్రత్యేక మార్గం నిర్మించనున్నారు. వీటితోపాటు అన్ని రకాల సదుపాయాలు కల్పించనున్నారు.
గురువారం వేలం వేసిన 6, 7, 8, 9 ప్లాట్లు రూ.1532.5 కోట్లు పలికాయి. అత్యధికంగా ఎకరం 72 కోట్లు పలికింది. గురువారం సాయంత్రం 6 గంటల వరకు సాగిన వేలంలో అత్యల్పంగా ఎకరం ధర రూ.51.75 కోట్లు పలికింది. 7 ఎకరాల ప్లాట్‌కు ఎకరాకు 57.25 కోట్లు చొప్పున రూ. 400.75 కోట్లు వచ్చింది. 6.55 ఎకరాల ప్లాట్‌కు ఎకరాకు 56.50 కోట్లు చొప్పున మొత్తం రూ. 379.070 కోట్లు ఆదాయం వచ్చింది.
9.71 ఎకరాల ప్లాట్‌కు ఎకరానికి రూ. 51.75 కోట్లు చొప్పున మొత్తం రూ.502.49 కోట్లురాగా, 3.6 ఎకరాల ప్లాట్‌కు ఎకరానికి అత్యధికంగా రూ. 72 కోట్లు పలికి మొత్తం రూ. 259.2 కోట్లు సమకూరింది. వీటన్నింటి అమ్మకం ద్వారా ఈ ఒక్కరోజే హెచ్ఎండీఏకి రూ. 1532.5 కోట్ల ఆదాయం సమకూరింది.
సాయంత్రంగా ప్రారంభమైన 10, 11, 14 ప్లాట్లకు 3 గంటలకు ప్రారంభమైన వేలం.. సాయంత్రం 6 గంటలకు ముగియాల్సి ఉండగా, వేలం పాటలో నిర్వాహకులు పాల్గొంటుండంతో రాత్రి 10 గంటల వరకూ వేలం పాట నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.