విధాత: దేశ రాజధాని ఢిల్లీని బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కప్పేసింది. 200 మీటర్ల దూరంలో ఏమి ఉన్నదో కూడా కనిపించనంత దట్టమైన పొగమంచు కురిసింది. ఇలాంటి దారుణమైన వాతావరణ పరిస్థితుల కారణంగా 119 విమానాలకు అంతరాయం ఏర్పడింది.
ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఫ్లైట్ ఇన్‌ఫార్మేషన్ డిస్‌ప్లే సిస్టమ్స్ ప్రకారం.. విదేశాలకు వెళ్లాల్సిన 22 విమానాలు, విదేశాల నుంచి రావాల్సిన 20 విమానాలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రావాల్సిన 30 విమానాలు, ఢిల్లీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 46 విమానాలకు అంతరాయం ఏర్పడింది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన రైళ్లు, రావాల్సిన రైళ్ల రాకపోకలపై కూడా అంతరాయం ఏర్పడింది. వందల మంది ప్రయాణికులు ఢిల్లీ రైల్వేస్టేషన్‌లోనే పడిగాపులు పడాల్సిన పరిస్థితి బుధవారం ఉదయం తలెత్తింది. దట్టమైన పొగ మంచు కారణంగా అనేక రైళ్లు చాలా ఆలస్యంగా నడిచాయి. పూర్వ ఎక్స్‌ప్రెస్, రాణి కమలాపతి శతాబ్ది ఎక్స్‌ప్రెస్, కత్రా వందేభారత్ ఎక్స్‌ప్రెస్, ఏపీ ఎక్స్‌ప్రెస్, ఢిల్లీ పల్‌వెల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటల కొద్ది ఆలస్యంగా నడిచాయి.